News

ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు

34views

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పచ్చదనాన్ని మరింత విస్తరించడంతోపాటు, ఇప్పటికే పెంచిన మొక్కలను పరిరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్‌, ఎండీ డి. లక్ష్మీపార్ధసారథి సూచించారు.

మంగళవారం ఇంద్రకీలాద్రిపై ఇటీవల ఏర్పాటు చేసిన కుండీల్లో, నేలపై నాటిన పూల మొక్కలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాటిన పూల మొక్కల పెరుగుదల, వాటి సంరక్షణ తీరును సమీక్షించారు. ఘాట్‌ రోడ్డు, గోపురం పరిసరాల్లోని చామంతి లాన్‌తోపాటు వివిధ రకాల పూల మొక్కలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అశ్వయుజ మాసం పూల మొక్కలకు అనుకూలమైన కాలమని పేర్కొన్నారు. బోగన్‌విల్లా, రాధామనోహరం, మందార తదితర జాతుల మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొక్కలకు అవసరమైన సంరక్షణ అందిస్తూ, ఇంద్రకీలాద్రిపై పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అమరావతి అభివృద్ధి సంస్థ గ్రీనరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ బి. శ్రీనివాసులు, సలహాదారు విశ్వప్రసాద్‌, బి. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.