News

తిరుమలలో రీల్స్‌ చిత్రీకరణపై టీటీడీ కఠిన చర్యలు..

3views

తిరుమల: శ్రీవారి ఆలయం ఎదుట నృత్యం చేస్తూ రీల్స్‌ చిత్రీకరించిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తక్షణమే స్పందించింది.ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తులపై తిరుమలలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఆలయ పరిసరాల్లో రీల్స్‌ పూర్తిగా నిషేధం
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో రీల్స్‌, వీడియోల చిత్రీకరణ పూర్తిగా నిషేధించినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ నియమాలు, ఆచారాలను గౌరవించాలని, పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని సూచించింది.

తిరుమల కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి పవిత్ర క్షేత్రమని భక్తులు గుర్తుంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆలయ పరిసరాల్లో క్రమశిక్షణ పాటిస్తూ, నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని కోరింది.

శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. భక్తులు టీటీడీ నిబంధనలకు సహకరించాలని దేవస్థానం కోరింది.