News

భారత పైలట్‌ మచ్చార్‌కు యూఏఈ అరుదైన గౌరవం

8views

ఫ్లై దుబాయ్‌ విమానంలో కాక్‌పిట్‌పై జరిగిన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్‌ 30న జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుల భద్రతకు, విమానాన్ని సురక్షితంగా ఉంచేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ, పైలట్‌తో పాటు సిబ్బందికి గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ II పురస్కారాన్ని అందజేశారు.

దుబాయ్‌ యువరాజు, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ఈ పురస్కారాలను అందజేశారు. అంతకుముందు అక్టోబర్‌ 3న ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో స్మిత్‌ మచ్చార్‌ను ఆయన పరామర్శించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌తో కలిసి టార్చ్‌ వెలిగించేందుకు రావాలని మోదీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని నెతన్యాహు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో వెల్లడించారు.