News

తిరుమల శ్రీవారి ఆలయంలోని శాసనాల డిజిటలైజేషన్

13views

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రాచీన శాసనాలను డిజిటలైజ్‌ చేసేందుకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) శ్రీకారం చుట్టింది. భారత్‌-శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఆలయానికి సంబంధించిన 750 శాసనాలను డిజిటలైజేషన్‌ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రకు సంబంధించిన అనేక కీలక వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

తిరుమల ఆలయంలోని శాసనాల సేకరణ ప్రక్రియ గతంలోనూ వివిధ దశల్లో కొనసాగింది. 1889, 1904, 1912, 1916 సంవత్సరాల్లో ఆలయ రెండో ప్రాకారం నుంచి 44 శాసనాలను సేకరించారు. అనంతరం 2008-09లో గర్భాలయం ఉన్న ఆనంద నిలయం గోడలపై చెక్కిన మరో 53 శాసనాలను సేకరించే ప్రక్రియను ఏఎస్ఐ ప్రారంభించింది.

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన ప్రముఖ శాసన పరిశోధకుడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి తిరుమలలోని శాసనాలను పరిశీలించి, వాటిలోని వివరాలతో పలు సంపుటాలను ప్రచురించారు. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల అనేక శాసనాల్లోని సమాచారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

తాజాగా చేపట్టిన డిజిటలైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఈ ప్రాచీన శాసనాల్లోని సమాచారాన్ని భద్రపరచడంతోపాటు భవిష్యత్‌ పరిశోధనలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ శాసనాలు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన రాజకీయ, మతపరమైన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చరిత్రను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

దక్షిణ భారత ఆలయాల చరిత్ర, అప్పటి రాజుల విరాళాలు, ధార్మిక ఆచారాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది.