ArticlesNews

పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థిని కృషి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు

6views

పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతోంది 16 ఏళ్ల విద్యార్థిని. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన గునీషా కౌర్ అనే అమ్మాయి తన ‘బజ్జింగ్ బ్లూమ్స్’ ప్రాజెక్ట్ ద్వారా 20కి పైగా పరాగ సంపర్క తోటలను (పోలినేటర్ గార్డెన్స్) అభివృద్ధి చేసి జీవ వైవిధ్యాన్ని కాపాడుతోంది. అందుకుగానూ గునీషా కౌర్ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకుంది. అలాగే ‘కలామ్స్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య వ్యవసాయం, వృక్ష సంపదకు కాపాడడానికి ఏఐ ఆధారిత డ్రోన్‌ను అభివృద్ధి చేసింది.

జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు
2023 మార్చి 5న గునీషా కౌర్ ‘బజ్జింగ్ బ్లూమ్స్’ అనే కార్యక్రమం ద్వారా ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో అధిక జనాభా, ఎక్కువ కంపెనీలు ఉన్న లుథియానా వంటి నగరంలో సహజ కీటకాలు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు వేగంగా కనుమరుగవుతున్నాయని గమనించింది. దీంతో ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆస్వాదించగలిగేలా సురక్షితమైన, అందమైన తోటలను సృష్టించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె ఏర్పాటు చేసిన తోటలు కేవలం తేనెటీగలు, సీతాకోకచిలుకలకే కాకుండా ఆటిజం ఉన్న పిల్లలకు, ప్రత్యేక అవసరాలున్న వారికి ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. కాగా, గునీషా కౌర్ లూథియానాలోని ‘సత్ పాల్ మిట్టల్ స్కూల్’లో ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతోంది.

తాను తోటలను కేవలం నాటడమే కాదు, అవి ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని ప్రకృతి ప్రేమికురాలు గునీషా కౌర్ వెల్లడించింది. తాను సైన్స్, సాంకేతిక రంగాల్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నానని చెప్పింది. ‘ఏరోబ్లూమ్’ (AeroBloom) అనే ఏఐ ఆధారిత డ్రోన్‌ను అభివృద్ధి చేశానని వివరించింది. తన ప్రాజెక్టులను నిర్వహించడానికి భారీ నిధులు ఖర్చు చేయనని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ల కోసం తానే స్వయంగా కష్టపడి వనరులను సమకూర్చుకుంటున్నానని తెలిపింది. తాను వారాంతాల్లో ఆర్ట్ క్లాసులు నిర్వహిస్తానని, అలాగే మొక్కలను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో తోటల నిర్వహణ ఖర్చులను భరిస్తానని స్పష్టం చేసింది. ఈ తోటల పెంపకంలో 500 మందికి పైగా యువతను పర్యావరణ పరిరక్షణ పనుల్లో భాగస్వాములను చేశానని వెల్లడించింది.

‘పంజాబ్ విద్యాశాఖ మంత్రిని కలిశాను’
“కొన్ని సామాజిక సంస్థల నుంచి నాకు సాయం లభిస్తోంది. ఇది తోటల నిర్వహణకు ఆర్థికంగా సహాయపడుతుంది. ప్రస్తుతానికి నేను చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. ఇటీవలే నేను పంజాబ్ విద్యాశాఖ మంత్రికి ఒక ప్రతిపాదనను పంపాను. అందులో పాఠశాల పాఠ్యప్రణాళికలో పర్యావరణ పరిరక్షణను చేర్చాలని కోరాను. పిల్లలు చిన్నప్పటి నుంచే తమ చుట్టూ ఉన్న పర్యావరణంతో మమేకమయ్యేలా పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశాను. ఈ చొరవ పట్ల విద్యాశాఖ మంత్రి నుంచి చాలా సానుకూల స్పందన వచ్చింది. లూథియానా నగరంలోని ఖాళీ ప్రదేశాలను పరాగ సంపర్క ఉద్యానవనాలుగా మార్చాను” అని గునీషా కౌర్ పేర్కొంది.

విద్యార్థినిపై ప్రిన్సిపల్ హర్షం
గునీషా కౌర్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ భూపిందర్ గోగియా కీలక వ్యాఖ్యలు చేశారు. గునీషాను ప్రిన్సిపల్ అత్యంత తెలివైన విద్యార్థినిగా అభివర్ణించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఇలాంటి మైలురాళ్లను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గునీషా భవిష్యత్తులో కూడా తన పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. గునీషా ఏర్పాటు చేసిన తోటల్లో ఎలాంటి రసాయనాలు లేదా పురుగుమందులు వాడరు. స్థానిక (దేశీయ), ముళ్లు లేని పూల మొక్కలను నాటారు. దీనివల్ల చిన్నారులు మొక్కలపై వాలిన సీతాకోకచిలుకలతో హాయిగా మమేకమవుతారు. ఈ తోటల వల్ల స్థానిక పరాగ సంపర్క జీవుల రకాలు 155శాతం పెరిగాయి. తేనెటీగల కార్యకలాపాలు సుమారు 200శాతం పెరిగాయి.