గుజరాత్‌లోని భరూచ్‌లో చారిత్రక జామా మసీదు వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
సుమారు 700 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ మసీదు ప్రదేశం జైన తీర్థయాత్ర కేంద్రమని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
మహారాష్ట్రకు చెందిన ఒక వర్గం ఈ ప్రదేశం తమదేనని చాలా కాలంగా వాదిస్తోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి జైన సమాజం కూడా చేరింది.
దీనిపై విచారణ చేయాలని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పందన కోరింది.
దీన్ని జైన దేవాలయంగా ప్రకటించాలని ఐదుగురు వ్యక్తులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ ప్రదేశాన్ని పూర్వకాలంలో ‘అశ్వబోధ తీర్థ, శకునిక విహార’ అని పిలిచేవారని వారు వాదిస్తున్నారు. ఇక్కడ తమ తీర్థంకరుడైన మల్లినాథుని విగ్రహం ఉందని వారు చెబుతున్నారు.
భరూచ్‌లోని జామా మసీదు (దీన్ని జుమీ మసీదు, జుమా మసీదు అని కూడా పిలుస్తుంటారు.) కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రదేశం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
మార్చి నెలలో కొందరు వ్యక్తులు ఈ మసీదులోకి బలవంతంగా వెళ్లేందుకు యత్నించారు. కొందరు మహిళలు మసీదు లోపల కొబ్బరికాయలు, ఇతర వస్తువులను ఉంచి పూజలు చేయబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తర్వాత జూన్‌లో మసీదు బేస్మెంట్కు సంబంధించినదిగా చెప్పే వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. మసీదు బేస్మెంట్లో దేవదేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయని అందులో పేర్కొన్నారు.ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరిన వేళ ఈ చారిత్రక కట్టడం గురించి వివిధ పక్షాలు ఏం వాదిస్తున్నాయి? అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం ఏం చెబుతోంది?
వివాదాస్పదంగా మారిన ప్రాంతానికి బీబీసీ వెళ్లేసరికి అక్కడ ఒక వాచ్మెన్, పురావస్తు శాఖ నియమించిన అధికారి కనిపించారు.
ఈ మసీదు వద్ద రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు జరుగుతున్నాయి. వివాదం మొదలైన తర్వాత ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు.
భరూచ్‌లోని జామా మసీదును 14వ శతాబ్దంలో నిర్మించారని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మసీదు ప్రాంగణంలో 19 తీర్థంకరుడైన మల్లినాథుని విగ్రహం ఉందని జైనులు వాదిస్తున్నారు. దీనిని పరిరక్షించి, పూజలు చేసుకునే హక్కు కల్పించాలని పిటిషనర్లు కోరుతున్నారు.
దిల్లీకి చెందిన హరిశంకర్ జైన్, రాహుల్ దీవాన్ సహా మరో ముగ్గురు ఈ పిటిషన్లు వేశారు.
ఈ మసీదును 14వ శతాబ్దంలో ఘియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించారని జైనులు వాదిస్తున్నారు.
ఆ మసీదులో దేవాలయాలను తలపించే శిల్పాలతోపాటు, ఏనుగులు, గుర్రాల బొమ్మలు, నాట్యం చేస్తున్న మహిళల విగ్రహాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు.





