News

లోక్‌భవన్‌లో నాన్‌వెజ్‌పై నిషేధం లేదన్న గవర్నర్‌ ఆఫీస్

6views

కేరళ లోక్‌భవన్‌లో కేవలం శాకాహార వంటకాలే తయారు చేయాలంటూ ఎలాంటి అధికారిక సర్క్యులర్‌ జారీ చేయలేదని గవర్నర్‌ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కొత్త గవర్నర్‌ ఓం ప్రకాశ్‌ మాథుర్‌ వ్యక్తిగతంగా శాకాహారం తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన కోసం వంటగదిలో శాకాహార భోజనం మాత్రమే తయారు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ ఏర్పాట్లు మౌఖిక సూచన మేరకే జరుగుతున్నాయని, లోక్‌భవన్‌ సిబ్బంది ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపాయి. ఈ అంశంపై అనవసర వివాదం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తీవ్రంగా స్పందిస్తూ, ఇది కాషాయ అజెండాలో భాగమని విమర్శించారు.

కేరళ కొత్త గవర్నర్‌గా ఓం ప్రకాశ్‌ మాథుర్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో లోక్‌భవన్‌ వంటగదిలో మాంసాహార వంటకాల తయారీ, వడ్డింపుపై నిషేధం విధించినట్లు గురువారం కథనాలు వెలువడ్డాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ అదనపు ప్రైవేట్‌ కార్యదర్శి పీ శ్రీకుమార్‌ వివరణ ఇచ్చారు. గవర్నర్‌ కోసం కేటాయించిన వంటగదిలో ఆయన ఆహార అభిరుచులకు అనుగుణంగా శాకాహార భోజనం తయారు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు లేదా సర్క్యులర్‌ జారీ చేయలేదని స్పష్టం చేశారు. లోక్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగులు తమకు నచ్చిన ఆహారాన్ని బయటి నుంచి తెచ్చుకుని తినేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సిబ్బంది ఆహార ఎంపికలపై పరిమితులు విధించలేదని స్పష్టం చేశారు.