ArticlesNews

భక్తి ఉద్యమంలో ప్రసిద్ధురాలైన కృష్ణభక్తి కవయిత్రి

3views

(ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ మీరాబాయి జయంతి)

భారతదేశంలో మహిళలపై వివక్ష చూపడమే తప్ప వారి సృజనాత్మకతకు చోటు లేదనే దుష్ప్రచారం నేటికీ వినిపిస్తుంది. అది తప్పని నిరూపించే ఉదాహరణలు ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల మీదుగా ఆధునిక కాలం వరకూ చాలా ఉన్నాయి. అటువంటి మహిళల్లో ఎన్నదగిన స్త్రీమూర్తి మీరాబాయి. భారతదేశంలో మహిళలు ఇంటికీ, వంటింటికే పరిమితం అనే మాటను పూర్వపక్షం చేసే జీవితం మీరాబాయిది. మహిళా సాధికారత, భక్తి శక్తి, విశేషమైన సృజనశీలత ఆమె సొంతం. విశేషించి, భక్తి ఉద్యమంలో మీరా భజనలకు ప్రత్యేక స్థానమే ఉంది.

మీరాబాయి రాజస్థాన్‌లోని మెర్తా సంస్థానం చౌకరీ గ్రామంలో సామాన్య శకం 1498లో ఆశ్వయుజ పూర్ణిమ నాడు జన్మించింది. ఆమె తండ్రి రతన్‌సింగ్ రణ్‌థోడ్‌… సంస్థానాధీశుడు రావు దూదాజీ చిన్నకుమారుడు. రతన్‌సింగ్ జీవితంలో ఎక్కువ భాగం మొగలులతో యుద్ధాలలోనే గడచిపోయింది. అలాంటి ఒక యుద్ధంలోనే చిన్నవయసులో చనిపోయాడు. మీరాబాయికి సుమారు ఏడేళ్ళ వయసు వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది. తాత రావు దూదాజీ దగ్గరే పెరిగిన మీరా…. ఆయన నుంచి మతం, రాజకీయాలు, పరిపాలన వంటి విషయాలు నేర్చుకుంది. సంగీతం, చిత్రలేఖనంలోనూ మీరాకు ప్రవేశం ఉంది.

మెర్తా సంస్థానాధీశులు విష్ణుభక్తులు. అలా మీరాబాయి వైష్ణవ ధర్మంలో పెరిగింది. నాలుగేళ్ళ బాల్యంలో తల్లి మాటలు విని కృష్ణుడినే తన భర్తగా భావించింది. అదే సమయంలో ఒక సాధువు శ్రీకృష్ణుడి విగ్రహం ఇచ్చి పూజావిధానం వివరించడం మీరా భక్తిని మరోమెట్టుకు తీసుకువెళ్ళింది. నాటినుంచీ మీరా జీవితం ఆ మూర్తితో పెనవేసుకుపోయింది. కొన్నాళ్ళకు మీరాబాయికి మేవాడ్‌లోని చిత్తోడ్ సంస్థానానికి చెందిన రాణా కుంభతో వివాహం జరిగింది. పెళ్ళి తర్వాత కూడా మీరా కృష్ణభక్తికి ఆటంకం కలగలేదు. ఇంటిపనులు చేసుకున్న తర్వాత కృష్ణ మందిరానికి వెళ్ళి అక్కడ భక్తి పారవశ్యంతో పాటలు పాడేది. క్రమంగా ఆమె తన ఆధ్యాత్మిక సాధనకే ఎక్కువ సమయం కేటాయించసాగింది. దేవాలయానికి వచ్చే భక్తులు ఆమె భజనలను విని పరవశించిపోయేవారు.

కొన్నాళ్ళకు మీరా బృందావనానికి తరలిపోయింది. అక్కడ ఆమె సాధ్వి జీవితం గడిపింది. కృష్ణుడిపై భజనలు ఆలపించడం, సాధుసంతులతో.. భక్తులతో.. సద్గోష్టి చేయడం, శ్రీకృష్ణ సంబంధిత పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేయడం ఆమె నిత్యకృత్యాలు అయ్యాయి. క్రమంగా మీరా భజనలు ప్రజాదరణ పొందసాగాయి. ఆమె భజనల్లో సరళమైన పదాల్లో వినిపించే భక్తి తాత్విక భావాలు సామాన్యులను సైతం తన్మయత్వానికి లోనుచేసాయి. మీరా తన జీవిత చరమాంకాన్ని ద్వారకలో గడిపింది. యాభయ్యేళ్ళు కూడా నిండకుండానే, 1547లో మీరాబాయి భౌతికదేహాన్ని వీడి తన ప్రభువులో ఐక్యమైపోయింది.

మీరాబాయి వంటి అద్భుతమైన వ్యక్తిని సరిపోలినవారెవరూ దేశంలోనే లేరు. రాజకుమార్తెగా పుట్టిన సాధ్వి, తాత్వికురాలు, కవయిత్రి, ‌ఋషిక జీవితం గడిపిన మహానుభావురాలు. ఇహలోక భోగాలపై ఆశే లేని మీరా త్యాగ వైరాగ్యాలతో సంక్లిష్టమైన భక్తిమార్గంలో కొనసాగింది. ఆమె స్వరపరచిన వందలాది భజనలు నేటికీ ఉత్తరాది అంతటా వినిపిస్తూ భారతీయుల హృదయాల్లో కృష్ణభక్తి జ్యోతిని జ్వలింపజేస్తూన్నాయి.