News

శ్రీశైలంలో సాధు, సన్యాసుల తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి

6views

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో నివసిస్తున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి దూరంగా తరలించాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర సాధు పరిషత్‌, శ్రీశైలం సాధు భవన్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. దేవదాయశాఖ నిబంధనలు, సనాతన ధర్మం, శ్రీశైల క్షేత్ర సంప్రదాయాలపై అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాలు సాధు, సన్యాసులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు.

ఈ మేరకు శ్రీశైలం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ శ్రీనివాసరావును రాష్ట్ర సాధు పరిషత్‌ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ, ప్రధాన కార్యదర్శి అరవింద స్వామిజీతో పాటు స్థానిక ఆశ్రమాల పీఠాధిపతులు, నిర్వాహకులు, సాధు సంతులు కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధుసంతులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, భిక్షువులు, అవధూతలు, సిద్ధులు, గురువులు, ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశైల మహాక్షేత్రానికి నిత్యం వస్తుంటారని తెలిపారు. సాధు, సన్యాసుల వల్ల క్షేత్రానికి ఎలాంటి నష్టం కలగదని వారు స్పష్టం చేశారు.

శ్రీశైలంలో నివసిస్తున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టాలన్న నిర్ణయాన్ని గత నెల 19న ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సాధు సంతులు కోరారు.

ఈ నిర్ణయానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సనాతన ధర్మం, శ్రీశైల మహాక్షేత్ర సంప్రదాయాలు, సాధు సంతుల ఆచార వ్యవహారాలపై అవగాహన లేకుండా దేవస్థాన పరిపాలన ఎలా కొనసాగిస్తారని వారు ప్రశ్నించారు.

23లోగా నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌
సాధు సంతుల సమస్యపై ఈ నెల 23వ తేదీలోపు దేవస్థానం ఈఓ తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా వెల్లడించాలని వారు కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 23న జరగనున్న దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సాధు సంతులు, ఆశ్రమాల స్వామిజీలతో కలిసి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.

అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సాధు సంతులు హెచ్చరించారు. అంతకుముందు సాధు సంతులు, ఆశ్రమాల ప్రతినిధులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.