News

ఆర్ఎస్ఎస్ సేవ భారతదేశ సేవా సంప్రదాయానికి ప్రతిబింబం : ఉప రాష్ట్రపతి

5views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్దపు సేవ భారతదేశ సేవా సంప్రదాయానికి ప్రతిబింబమని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల సేవా కార్యక్రమాలపై తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రచించిన “ఎ సెంచరీ ఆఫ్ సర్వీస్ – ది ఆర్ఎస్ఎస్ ఇన్ 100 యాక్ట్స్ ఆఫ్ సర్వీస్” పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో విడుదల చేశారు.

తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ వందేళ్ల సేవా ప్రయాణం, సామాజిక బాధ్యత, దేశ నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలను ఈ పుస్తకం వివరిస్తుందని తెలిపారు.“నేటి వార్త రేపటి చరిత్ర అవుతుంది” అని పేర్కొన్న సి.పి. రాధాకృష్ణన్.. సమాజంలో జరుగుతున్న మంచి పనులు ప్రజల జ్ఞాపకాల నుంచి మరుగున పడకుండా వాటిని నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా స్ఫూర్తి కాలక్రమంలో నిరంతర సామాజిక సేవగా ఎలా రూపాంతరం చెందిందో ఈ పుస్తకం తెలియజేస్తుందని చెప్పారు.

“సేవ ఒక ధర్మం – ఒక విధి” అనే భావనను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. ఆర్ఎస్ఎస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు సమాజంలోని వివిధ వర్గాలకు చేరాయని అన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, కార్మికులు, మహిళలు, పిల్లలతో పాటు అవసరమైన అనేక వర్గాలకు సేవా కార్యక్రమాలు అందించారని పేర్కొన్నారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు అందించడంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కూడా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. పుస్తకంలోని “శీల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం” అనే ప్రధాన ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ.. దేశ నిర్మాణానికి దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, జాతీయ ఐక్యత ఎంతో కీలకమని సి.పి. రాధాకృష్ణన్ అన్నారు.

ఈ పుస్తకం ఆర్ఎస్ఎస్ వందేళ్ల సేవకు సంబంధించిన రికార్డుగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు భారతదేశ సేవా సంప్రదాయం, సంస్కృతి, జాతీయ చైతన్యాన్ని పరిచయం చేసే పత్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

చరిత్రను నమోదు చేసే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి.. పుస్తక రచయిత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ప్రచురణలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, పుదుచ్చేరి హోం మంత్రి ఎ. నమశ్శివాయం, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.