ArticlesNews

భారతీయ సంస్కృతిలో ‘ఆశీర్వాదం’

13views

భారతీయ సంస్కృతిలో ‘ఆశీర్వాదం’ అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక శక్తి. ‘ఆశీస్సు’ అంటే శుభాన్ని కోరుకోవడం. పెద్దలు మనఃపూర్వకంగా పలికే శుభ వచనం అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకేనేమో భాషా ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచమంతటా పిన్నలను ఆశీర్వదించే సంప్రదాయం కనిపిస్తుంది. కొన్నిచోట్ల కేవలం దీవెనలు అందించడానికే కొన్ని వేడుకలు నిర్వహించడం కూడా కద్దు. ఆశీర్వచనానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలిపే అనేక ఘట్టాలు మన పురాణేతిహాసాల్లోనూ కనిపిస్తాయి.

తపస్సు ద్వారా సంపాదించిన పుణ్యఫలంలో కొంత భాగాన్ని ఇతరులకు ధారపోయడమే ఆశీర్వాదం అని చెబుతాయి పురాణాలు. ఒక ఉత్తముడు ‘శుభమస్తు’ అన్నప్పుడు, ఆ వాక్కుకు వారి తపశ్శక్తి తోడవుతుంది. అందుకే మన ప్రాచీనులు ‘అభివాదన శీలస్య నిత్యం వృద్ధిపసేవినః…’ అంటూ పెద్దలకు నమస్కరించడం వల్ల ఆయువు, విద్య, యశస్సు, బలం పెరుగుతాయని చెప్పారు.

మృత్యువు సమీపించిన వేళ, మార్కండేయుడు సప్త రుషులకు నమస్కరించగా, వారు ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ అని దీవించారు. విధిని సైతం మార్చగలిగే శక్తి మహర్షుల ఆశీర్వచనానికి ఉంటుందని ఈ ఘట్టం నిరూపిస్తుంది. చివరికి పరమేశ్వరుడి అనుగ్రహంతో మార్కండేయుడు మృత్యుంజయుడయ్యాడు. సత్యవంతుడి ప్రాణాలు తీసుకువెళ్తున్న యమధర్మరాజుకు సావిత్రి భక్తితో నమస్కరించి, తన ధర్మప్రసంగంతో ఆయనను మెప్పించింది. యముడు ఆమెకు‘మాంగల్య ప్రాప్తి’ని ప్రసాదించాడు. ఆ ఆశీర్వచన ఫలమే మరణించిన సత్యవంతుణ్ని పునర్జీవితుణ్ని చేసింది.

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు గాంధారి దుర్యోధనుణ్ని ఆశీర్వదిస్తూ ‘యతో ధర్మస్తతో జయః’ (ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది) అంది. ఇది ఒక నిష్పాక్షిక ఆశీర్వచనం. అంటే, ఆశీర్వాదం కూడా ధర్మానికి లోబడే పనిచేస్తుందని ఇక్కడ బోధపడుతుంది. ఆశీర్వచనం పొందే వ్యక్తికి వినయం, అర్హత ఉండాలి. అర్హత లేనిదే ఫలితం దక్కదు. నది సముద్రంలో కలిసినట్లు, ఒకరి సంకల్పం మరొకరి శ్రేయస్సు కోసం వినియోగపడినప్పుడు అక్కడ దైవీ శక్తి ప్రసరిస్తుంది.

‘శుభాని భవంతు’- అంటే నీకు శుభములు కలుగుగాక అని అర్థం. ఈ ఒక్క మాట మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కార్యసిద్ధి వైపు నడిపిస్తుంది. పెద్దలు ఆశీర్వదించేటప్పుడు వాళ్ల చేతులను మన శిరస్సుపై ఉంచడం వెనక ఒక అర్థముంది. వారిలోని సత్సంకల్పం ఆ ఆత్మీయ స్పర్శ ద్వారా మనలోకి ప్రవేశించి చిత్తశుద్ధిని కలిగిస్తుందని విశ్వాసం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి గురువుల ఆశీర్వాదం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వినయంతో ఒదిగి నమస్కరించినప్పుడు లభించే ఆశీస్సు, మనిషిలోని అహంకారాన్ని నిర్మూలించి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మంచి పనులు చేస్తూ నలుగురికీ తలలో నాలుకలా మెదులుతూ అందరి దీవెనలు పొందే వ్యక్తికి ఆయురారోగ్యాలతో పాటు, సమాజంలో గౌరవం, కార్యసిద్ధి తప్పక లభిస్తాయి.