News

పంట వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయం.. రైతుకు ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

23views

పంట వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుకు ఆరోగ్యం, ఆదాయంతో పాటు ఆనందం కూడా లభిస్తుందని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ కె.అమలకుమారి అన్నారు. రాజుపాలెం మండలంలోని రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు గల్లా ప్రసాద్‌, గుర్రాల మల్లికార్జున్‌ల పొలాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు పీఎండీఎస్‌ విధానంలో వివిధ రకాల విత్తనాలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. రబీ పంటల అనంతరం డ్రైసోయింగ్‌ చేయడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల చైతన్యం పెరిగి, భూసారం మెరుగుపడుతుందని వివరించారు.

గల్లా ప్రసాద్‌ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారని అమలకుమారి ప్రశంసించారు. పొలంలోనే అన్ని వసతులతో కూడిన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులంతా కలిసి ప్రకృతి వ్యవసాయం చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ క్షేత్రంలోని పంటలు ఆరోగ్యంగా ఉండటం ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రత్యేకతను తెలియజేస్తోందన్నారు.

పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయలు, పూలు, సీజనల్‌ పంటలను ఒకే క్షేత్రంలో సమీకృతంగా సాగు చేయడం ద్వారా రైతులకు ఏడాది పొడవునా వివిధ పంటల నుంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుందని అమలకుమారి తెలిపారు.

ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పాటించడం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్‌ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకుని, నేల ఆరోగ్యాన్ని కాపాడే విధానాలను అనుసరించాలని సూచించారు.