ArticlesNews

పర్యావరణ హితైషి గజాననుడు

7views

అర్చనలు, ఆరాధనుల, యజ్ఞయాగాదులు వినాయకుడి తొలిపూజతోనే ప్రారంభం కావడం సనాతన సంప్రదాయం. ప్రమథగణాలకు ఆధిపత్యం  పొందినందున గణపతిగా,విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడిగా  పూజలందు కుంటున్నాడు. భాద్రపద శుద్ద చతుర్దుశిని అభయవరద చతుర్థి అంటారు. తాము తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని అభయం కోరుతూ, దేవతల నుంచి  సామాన్యుల దాకా ఆ రోజున గణనాథుని అర్చిస్తారు.

గజననుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞాన, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయనను ప్రణవనాద స్వరూపుడిగా, శబ్ద బ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకుడిగా గణేశ పురాణం, సమస్తలోకానికి ఆధారశక్తిగా గణేశ గీత చెబుతున్నాయి. గణాధిపతిగా సర్వసమర్థుడిగా వినుతికెక్కిన అంబికానందనుడి నుంచి దేవతలు, మహర్షులూ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో సహాయసహకారాలను అందుకున్నవారే. పంచమవేదంగా కీర్తినందుకున్న మహాభారత రచనకు వ్యాసమహర్షి ఆయనను లేఖకుడిగా నియమించుకోవడం అందుకు ఒక ఉదాహరణ.

గణేశ, ముద్గల, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాలు విఘ్నేశ్వరుని విభూతులను విశదీకరిస్తున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శతకాలు, ప్రబంధాలు ఆయన మహిమను కొనియాడాయి. ఆయనను అర్చించడంతో సర్వ విఘ్నాలు సమసిపోయి, సమస్త విజయాలు సంప్రాప్తిస్తాయని వివరిస్తున్నాయి. దేవతల నుంచి సామాన్య మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయ తీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని వేదవాక్కు.అందుకు ఎన్నో గాథలు ఉదాహరణలు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం …అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణేశార్చన. ఊర్ధ్వలోకాల ఉద్ధరణ, దేవగణాలకు నేతృత్వం, భువిపై జీవుల మనుగడ పర్యవేక్షణ, సస్యకారక శక్తిని పెంపొందించడం ఆయన చతుర్బుజాలతో నిర్వహించే పాత్రలుగా ప్రవచనకర్తలు విశ్లేషిస్తారు.

వినాయకుడిని ప్రధాన దైవంగా ఆరాధించే మతాన్ని గాణపత్యం అంటారు. అయినా, ఆయన సర్వమతాలకు ఆరాధ్యదైవం. దేశవిదేశాల్లోనూ ఆయనకు విశేష సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. మాతాపితరులను దైవంగా భావించి, పూజించి గణాధిపత్యం పొందిన గణపతి,ఆదర్శపుత్రుడిగా భావి తరాలకు మార్గదర్శి. శక్తి,యుక్తి ఐశ్వర్యం, ఆనందం-అనే నాలుగు అంశాల పరిపూర్ణతత్త్వమే గణపతి రూపమని శాస్త్రవాక్కు.

పరమేశ్వరుడు, పరాశక్తి ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్న భావమే గణపతి స్వరూపమని బ్రహ్మాండపురాణం, పార్వతీదేవి శరీరం నుంచి ఉత్పన్నమైన మట్టి (నలుగు) ద్వారా గణపతి ఆవిర్భవించినట్లు శివమహాపురాణం, శబ్దస్పర్శ రూపరసగుణాల మేలుకలయిక గణేశుడని అధర్వణవేదం పేర్కొంటున్నాయి. ప్రకృతి ఆకృతే గణపతి (‘ప్రకృతీ పురుష అభేదాత్మకః గణేశః’)అని గణేశ పురాణోక్తి. పృథ్వీతత్తం గల మూలాధార చక్రానికి అధిష్ఠానదైవం గణనాథునిగా పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. మట్టి వినాయకుడిని పూజించాలనడంలోని రహస్యమిదేనంటారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆగమశాస్త్రం కూడా చెబుతోంది. పర్యావరణ కాలుష్య బెడదను ఎరిగిన మన పెద్దలు ఏర్పరిచిన సంప్రదాయం ఇది.

గణపతి జలరూపానికి ప్రతినిధి (‘జలరూపో వినాయకః’) కనుక మట్టితో చేసిన వినాయక ప్రతిమను నీళ్లలో లయం చేయాలి. చెరువు నుంచి సేకరించిన మట్టితో తొమ్మిది అంగుళాల ఎత్తుగల ప్రతిమను తయారు చేసి, తొమ్మిది రోజులు పూజించి, మట్టిని తెచ్చిన చోటనే నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది. మనిషి జీవితంలో ఎంత వైభోగం అనుభవించినా, దేహత్యాగం తరువాత పంచభూతాల్లో కలవడం అనివార్యం అనే సత్యాన్ని ఈ ఉదంతం వెల్లడిస్తోంది. వినాయక పూజా పత్రి నిమజ్జనాన్ని పర్యావరణం ఆరోగ్య కోణంలో చూస్తే… వర్షాల కారణంగా అప్పటికే కొత్త నీటితో నిండిన చెరువుల్లో, సరస్సుల్లో బాక్టీరియా వంటి క్రిములు చేరతాయని, ఓషధ గుణాలు కలిగిన పత్రిని ఆ నీటిలో వేయడం వల్ల, క్రిములునశించి, నీరు శుద్ధి అవుతుందని చెబుతారు.

గణపతి ప్రకృతి ప్రేమికుడు. మట్టితో చేసిన ప్రతిమ(ల)ను సహజసిద్ధ పత్రితో పూజించడం; మండపం, పావెల్లిని సహజ పదార్థాలతో అలంకరించడం వంటివి ప్రకృతిని గౌరవించే సంకేతాలు.మన పూర్వికులు చెప్పిన ప్రకృతి సంరక్షణే భగవత్‌ ‌సేవ’ అనే సూత్రాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. గజాననుడి పూజ ధార్మిక వేడుక మాత్రమే కాదు. సామాజిక స్ఫూర్తి, సాంస్కృతిక ఐక్యతకు, పర్యావరణ హితాన్ని చాటిచెప్పే గొప్పసందర్భం. స్వాతంత్య్ర పోరాట సమయంలో లోకమాన్య బాలగంగాధర్‌ ‌తిలక్‌.. ఈ ‌గణేశ్‌ ఉత్సవాలను సామూహికంగా ప్రారంభించి, ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు.

వినాయకచవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుతూ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ పండుగను కాలుష్య రహితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తమ ‘మనకీ బాత్‌’ (‌మనసులోని మాట) ప్రసంగంలో భాగంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌పారిస్‌తో చేసిన విగ్రహాలకు బదులుగా, స్థానిక కళాకారులు మట్టితో రూపొందించే విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. ఇలా మన సంప్రదాయాలను పాటిస్తూనే, ప్రకృతి పట్ల మనకు గల బాధ్యతను నెరవేర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక, స్థానిక కళాకారుల వద్ద విగ్రహాలను కొనుగోలు చేయడం ద్వారా ‘స్థానికులకు మద్దతు’ (Vocal for Local) స్ఫూర్తిని బలపరుస్తుందని,ఇది దేశ ప్రయోజనాలకు దోహదపడుతుందని అన్నారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్