ArticlesNews

ఆంధ్రా తిలక్, గ్రంథాలయోద్యమ నిర్మాత, తెలుగు భాషా సేవకుడు

2views

( సెప్టెంబర్ 14 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి )

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్య పోరాటంలో ఆకర్షితులయ్యారు. ఆంధ్రా తిలక్‌గా పేరు గడించారు. గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి ప్రజలందరికీ చదువుపై ఆసక్తి పెరిగేలా చేసారు. పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. వందలాది వ్యాసాలు రచించారు. దేశ సంక్షేమమే ఆయన ధ్యేయం.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు పుట్టింది పేద కుటుంబమే అయినా ఆయనకు చదువుపై అమితమైన ఆసక్తి ఉండేది. కర్నూలు, గుత్తి, నంద్యాల పట్టణాలలో ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించారు. దాతల ఉపకార వేతనాలతో 1906లో మద్రాసులో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేశారు. రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా 1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారు. అక్కడ బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసం విని, ఆ స్ఫూర్తితో సహచర విద్యార్ధులందరితోనూ వందేమాతరం బ్యాడ్జిలు ధరింపజేసారు. ఫలితంగా విద్యార్థి నాయకుడైన సర్వోత్తమరావును కళాశాల నుండి బహిష్కరించారు. ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వకూడదని కూడా ప్రభుత్వం నిర్దేశించింది. తర్వాత ఆయన పత్రికారంగంలోకి ప్రవేశించారు. ‘స్వరాజ్య’ అనే తెలుగు పత్రిక స్థాపించారు. అందులో తెల్లదొరతనాన్ని తీవ్రంగా విమర్శిస్తుండేవారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. అలా, ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ అయిన గాడిచర్ల, ఆంధ్రా తిలక్ అని పేరు గడించారు.

స్వతంత్ర పోరాట యోధుడు మాత్రమే కాదు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు పత్రికా రచయిత, సాహిత్యవేత్త, గ్రంథాలయోద్యమ పితామహుడిగానూ ప్రఖ్యాతి గడించారు. ఆయన, లోకమాన్య తిలక్ స్థాపించిన హోంరూల్‌లీగ్‌కు ఆంధ్రరాష్ట్ర కార్యదర్శిగా పనిచేసారు. 1927లో నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సభ్యుడిగా మద్రాస్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగానూ పనిచేశారు.

నంద్యాలలోనూ, కర్నూలులోనూ హిందూ-ముస్లింల సఖ్యతకు, ఖద్దరు వ్యాప్తికి, త్రాగుడు నిషేధానికి గణనీయమైన కృషి చేశారు. ఆంధ్రదేశంలో చైతన్యం కలిగించడానికి వేసవి పాఠశాలలను ప్రారంభించారు. ఆ ప్రేరణతోనే అనంతర కాలంలో వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్‌లో ఉంటూనే గాంధీ, నెహ్రూల నిర్ణయాలను వ్యతిరేకించిన ధీరుడు గాడిచర్ల. గాంధీ సహాయ నిరాకరణోద్యమం తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసారు. ఒక విషయంలో విభేదం వచ్చి, నెహ్రూ ఆదేశించగానే, హరిసర్వోత్తమరావు కాంగ్రెస్ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేసారు. తాను నమ్మిన సిద్ధాంతానికి, విలువలకూ జీవితాంతం కట్టుబడిన నిస్వార్థ దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు.

1930నుంచీ గాడిచర్ల రాజకీయ కార్యకలాపాలు తగ్గించుకున్నారు. గ్రంథాలయోద్యమం మీద దృష్టి కేంద్రీకరించారు. 1934 నుంచి జీవితాంతం ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్రరాష్ట్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పాటును కూడా చూసారు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు తొలినాళ్ళలో గిడుగు రామ్మూర్తి పంతులుగారి వ్యావహారిక భాషావాదాన్ని వ్యతిరేకించారు. కాలక్రమంలో తన అభిప్రాయాన్ని మార్చుకుని గ్రాంథిక భాషను వదిలిపెట్టి వాడుకభాషలోనే రాయసాగారు. తెలుగు భాషా సాహిత్యాల వృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికకు ఆయన మొదటి సంపాదకుడు. ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకుడిగా పనిచేసారు. మహిళలకోసం ప్రత్యేకంగా సౌందర్యవల్లి అనే పత్రిక నడిపారు. ది హిందూ, ఇంద్రావతి, కౌమోదకి వంటి పత్రికల్లో వ్యాసాలు రాసారు. గాంధేయవాదాన్ని ప్రబోధించే పుస్తకాలను రచించారు, అనువదించారు. పౌరవిద్య, వయోజన విద్య అనే గ్రంథాలతో పాటు అబ్రహాం లింకన్ చరిత్రనూ రచించారు.

తన జీవితాన్ని ఆంధ్ర సమాజం కోసం అంకితం చేసిన గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు 1960 ఫిబ్రవరి 9న తుదిశ్వాస విడిచారు. ఆయన ఆయన స్మారకార్థం విజయవాడలో ‘సర్వోత్తమ భవనం’ ఏర్పడింది. ఆయన ఆశయాల కృషికి వేదికగా నిలిచింది.