
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన మహిళల బృందం సంప్రదాయ వడిసెల వంటి పరికరాలతో ఆరావళి పర్వత శ్రేణిపైకి విత్తన బంతులు విసురుతోంది. సాధారణ పద్ధతుల్లో మొక్కలు నాటేందుకు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలు లక్ష్యంగా ఈ పచ్చదనం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. మట్టి, సేంద్రియ ఎరువులు కలిపి చేసిన ఈ విత్తన ఉండలు ప్రస్తుత వర్షాకాలంలో సులువుగా నేలలో కలిసిపోయి మొక్కలుగా ఎదుగుతాయి. దేవ్‌గఢ్ పురపాలికతోపాటు ‘కెరీర్ సంస్థాన్ రాజ్‌సమంద్’, ‘కెరీర్ మహిళా మండల్ దేవ్‌గఢ్’, ‘మేరా యువభారత్ రాజ్‌సమంద్’ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. గత ఎనిమిదేళ్లుగా ఏటా వర్షాకాలంలో ఈ కార్యక్రమాన్ని తాము చేపడుతున్నట్లు ఈ సంస్థల ప్రతినిధి భావనా పలివాల్ తెలిపారు. ఇప్పటికి లక్షన్నరకు పైగా విత్తన బంతులను ఇలా వెదజల్లామన్నారు. ఈ ఏడాది 50,000 లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల గృహిణులతోపాటు విద్యార్థులు ఈ పర్యావరణ యజ్ఞానికి తమ సహకారం అందిస్తున్నారు.





