
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. తాను రైఫిల్ షూటర్‌నని చెప్పుకొని అత్తరు వ్యాపారుల వద్ద నుంచి విషపూరిత ద్రవాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. అత్తరు వ్యాపారులు కూడా పోలీసుల విచారణలో ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
సాధిక్ తమ వద్దకు వచ్చి విషపూరిత లిక్విడ్ కావాలని అడిగాడని వ్యాపారులు చెప్పినట్లు సమాచారం. తొలుత తాము థాయ్ పొటాషియం ఇచ్చామని, దానిని ఎందుకు ఉపయోగిస్తావని ప్రశ్నించగా.. తాను షూటర్‌నని చెప్పి తీసుకెళ్లాడని వారు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.
విషపూరిత రసాయనాల విషయమై పోలీసులు ఈ కేసులో ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా పొటాషియం సైనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఎవరైనా ఎలా సేకరించారు? వాటిని ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించారు? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రెండో రోజు కూడా సాదిక్‌ను ప్రశ్నించిన పోలీసులు
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కాకినాడ పోలీసులు సాదిక్ ఖాన్‌ను మరోసారి విచారించారు. మరోవైపు అత్తరు వ్యాపారులను కూడా ప్రశ్నించి వివరాలు సేకరించినట్లు సమాచారం.
మంగళవారం తొలిరోజు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సాదిక్‌ను విచారించిన సమయంలో అతడు పోలీసులకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. కేసులో తనపై ఉన్న ఆరోపణలను తిరస్కరిస్తూ, నేరాన్ని నూకరాజు కుమార్తె సౌజన్యపైకి నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
బుధవారం రెండో రోజు అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్, సీఐ ప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఎస్‌ఐలు సాదిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జగదీశ్వరరెడ్డి మృతికి సంబంధించిన ఆరోపణలపైనా పోలీసులు అతడిని ప్రశ్నించినట్లు సమాచారం.
“జగదీశ్వరరెడ్డి మరణం వెనుక నీ హస్తం ఉందని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. సైనైడ్ వంటి విషపూరిత పదార్థం కలిపిన ప్రొటీన్ డ్రింక్ ఇచ్చి చంపినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై నీ సమాధానం ఏమిటి?” వంటి ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
సాదిక్ విద్యార్హతలు, షూటింగ్ సర్టిఫికెట్లపై అనుమానాలు
ఇక సాదిక్ ఖాన్ విద్యార్హతలు, రైఫిల్ షూటింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అతడు చూపించిన విద్యార్హతల పత్రాలు, షూటింగ్ సర్టిఫికెట్లు నిజమైనవేనా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో అతడి విద్యార్హతలకు, రైఫిల్ షూటింగ్ సర్టిఫికెట్లకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమైనట్లు సమాచారం. కొన్ని ధ్రువీకరణ పత్రాలు నకిలీవని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో విషపూరిత రసాయనాల సేకరణ, వాటి వినియోగం, జగదీశ్వరరెడ్డి మృతి తదితర అంశాల మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాదిక్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.





