
( సెప్టెంబర్ 11 – వివేకానంద చికాగో ప్రపంచ మత మహాసభల్లో ప్రసంగించిన రోజు )
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో కాదు, ప్రపంచ మతాల చరిత్రలోనే 1893 సెప్టెంబరు 11 చిరస్మరణీయమైన రోజు. ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ వేదికపై కొత్తగా పరిచయం చేసింది. “అమెరికా సోదర సోదరీమణులారా!” అనే సంబోధనతో ప్రారంభించి ఆయన చేసిన ప్రసంగం కేవలం మతపరమైన ఉపన్యాసం కాదు. అది భారతీయ సంస్కృతి, విశాల దృక్పథం, మానవతావాదం, మత సహనాలను ప్రపంచానికి వినిపించిన స్వరం.
స్వామి వివేకానంద చికాగోకు వెళ్లిన కాలం భారతదేశ చరిత్రలో కీలకమైన దశ. బ్రిటిష్ పాలనలో భారతదేశం పరాధీనంగా ఉంది. పాశ్చాత్య ప్రపంచం భారతదేశాన్ని పేదరికం, మూఢనమ్మకాలతో వెనుకబడిన దేశంగా కించపరిచేది. అలాంటి సమయంలో భారతీయ తత్వచింతన, వేదాంతం, హిందూ ధర్మంలోని విశాల దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం వివేకానంద సాధించిన గొప్ప చారిత్రక కార్యం.
భౌతికవాద భావజాలంలో కొట్టుకుపోతున్న అమెరికన్ ప్రజల హృదయాల్లోకి వివేకానంద తొలి మాటలు చొచ్చుకు పోయాయి. “సోదర సోదరీమణులారా” అన్న సంబోధనతో వివేకానందుడి మానవతా దృక్పథం వారిని కదిలించివేసింది. ప్రపంచ ప్రజలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారనే హిందూ భావన, వివేకానందుడి గంభీర గళంలో ప్రతిధ్వనించింది. ఆయన ప్రసంగం ప్రధాన సందేశం… మతం మనుషులను విడదీయడానికి కాదు, కలపడానికి అన్నదే. భిన్నమైన మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నా వాటి అంతిమ లక్ష్యం మానవుని ఉన్నత స్థితికి చేర్చడమేనని ఆయన వివరించారు.
వివేకానంద తన చికాగో ప్రసంగంలో భారతదేశాన్ని మత సహనం, విశాల హృదయానికి ప్రతీకగా పరిచయం చేశారు. భారతదేశం శతాబ్దాలుగా వివిధ మతాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆశ్రయం కల్పించిన దేశమని గుర్తుచేశారు. ఇతర మతాల ఉనికిని అంగీకరించడమే కాకుండా, వాటి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలనే ఉన్నతమైన ఆలోచన భారతీయమైన స్వభావమని ఆయన పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసారు.
వివేకానంద చికాగో ఉపన్యాసం భారతీయ వేదాంత తత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చేరువ చేసింది. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందనే భావన ఆయన బోధనలో ప్రధానమైనది. మానవుడిని కేవలం శరీరంగా కాకుండా ఆధ్యాత్మిక శక్తి కలిగిన జీవిగా చూడాలన్నది ఆయన తత్వం. ఆ దృక్పథం భారతీయ ఆధ్యాత్మికతను మూఢ విశ్వాసాల సమాహారంగా చూసే అభిప్రాయాలను సవాలు చేసింది. హిందూ తత్వంలోని లోతైన తాత్త్వికతను, ఆత్మ–బ్రహ్మ భావనను, మానవ ఏకత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
చికాగో ఉపన్యాసం ప్రభావం అమెరికా లేదా పాశ్చాత్య ప్రపంచానికే పరిమితం కాలేదు. భారతీయుల్లో అది ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. వందల యేళ్ళ పరాయి పాలనలో ఆత్మన్యూనతలో పడిపోయిన భారతీయులకు తమ సంస్కృతి, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక సంపదల గొప్పదనంపై నమ్మకం కలిగింది. వివేకానంద సందేశంలో కనిపించిన ఆత్మగౌరవం తరువాతి తరాల జాతీయ చైతన్యాన్ని ప్రభావితం చేసింది. భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాదు, మానసిక స్వాతంత్ర్యం కూడా అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
వివేకానంద ఆధ్యాత్మికతను కేవలం వ్యక్తిగత మోక్షానికి పరిమితం చేయలేదు. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం, పేదలను ఆదుకోవడం కూడా ఆధ్యాత్మికతలో భాగమేనని బోధించారు. అందువల్ల చికాగో ప్రసంగం కేవలం మత ప్రసంగం కాదు. అది ఆధ్యాత్మికతకు సామాజిక బాధ్యతను జోడించిన ఆలోచనా ప్రవాహానికి ప్రతీక. ఆ ప్రసంగం భారతదేశానికి ఆధ్యాత్మిక విజయగాథ, భారతీయులకు ఆత్మవిశ్వాస ప్రకటన, ప్రపంచానికి మానవతా సందేశం.





