
రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేందుకు వీలుగా మండపాల నిర్వాహకుల కోసం విద్యుత్, పోలీసు శాఖలు కీలక మార్గదర్శకాలు విడుదల చేశాయి. మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల జారీతో పాటు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి.
వినాయక చవితి మండపాల కోసం ఈ నెల 26 వరకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందిస్తామని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజులను కూడా ఖరారు చేశారు. 500 వాట్ల విద్యుత్ వాడకానికి రూ.1,000, 1000 వాట్ల (1 కిలోవాట్) వాడకానికి రూ.2,250 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు రుసుముగా అదనంగా రూ.100 చెల్లించాలి. గ్రామ/వార్డు సచివాలయాలు, సీపీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ (apcpdcl.in) లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అక్రమ కనెక్షన్లపై కఠిన చర్యలు
ఎట్టి పరిస్థితుల్లోనూ మండపాల నిర్వాహకులు అక్రమంగా విద్యుత్ వినియోగించరాదని అధికారులు గట్టిగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి సమీపంలోని స్తంభాల నుంచి నేరుగా కరెంట్ తీసుకుంటే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండపాలను విద్యుత్ తీగల కింద ఏర్పాటు చేయవద్దని, వర్షానికి వైర్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
అనుమతుల కోసం సింగిల్ విండో
మరోవైపు గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల ప్రక్రియను పోలీసులు సులభతరం చేశారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ వంటి వివిధ శాఖల అనుమతులను ఒకేచోట పొందేలా ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ఎస్‌హెచ్‌వో క్షేత్రస్థాయిలో మండపాన్ని పరిశీలిస్తారు.
ప్రజల రాకపోకలకు, అత్యవసర వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడటం, విద్యుత్ వైరింగ్, అగ్నిమాపక భద్రత వంటి అంశాలను తనిఖీ చేశాకే తుది అనుమతి మంజూరు చేస్తారు. మండపాల వద్ద తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.





