ArticlesNews

ప్రమాద ఘంటికలు

5views

మారుతున్న కుటుంబ వ్యవస్థ.. సోషల్‌ ‌మీడియా ప్రభావం..పడిపోతున్న నైతిక విలువలు.. పెరుగుతున్న నేర ప్రవృత్తిని గమనిస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తోంది? అభివృద్ధివైపా? పతనం వైపా? అనే సందేహం కలగడం సహజం.

దేవుడికన్నా గురువుకు ఉన్నతస్థానం ఇచ్చే భారతీయ సంస్కృతిలో, ఒక విద్యార్థి తనకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపాల్‌నే హత్య చేయడం అత్యంత కలచివేసే ఘటన. దీనిని ఒక నేరంగా మాత్రమే చూసి మౌనం వహిస్తే సమస్య వ•లాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నానాటికీ వెలుగులోకి వస్తున్న ఇలాంటి ఘటనలు సమాజంలో ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. సమాజానికన్నా ముందు కుటుంబం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తట్టి చెప్తున్నాయి.

ఒకప్పుడు కుటుంబమే పిల్లలకు తొలి పాఠశాల. తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే మంచి మాటలు, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, తప్పు చేస్తే మందలింపు.. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, ఒకరిద్దరే సంతానం కావడంతో అతి గారాబంగా పెంచడం, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం, పిల్లలతో సంభాషణ తగ్గిపోవడం వంటి పరిణామాలు వారి మనసులపై ప్రభావం చూపుతున్నాయి. డబ్బు, చదువు, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే బాధ్యత కాదు; విలువలు, విచక్షణ నేర్పడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యమే. మొక్కై వంగనిదే మానై వంగునా అన్న రీతిలో బాల్యంలోనే మంచి అలవాట్లను నేర్పించాలి. బాల్యంలో వాళ్ల మనోఫలకం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో పిల్లల మనసులలో మనం ఏ సంస్కారాలు నాటుతామో అవి పెరిగి జీవితాన్ని సార్థకం చేస్తాయనేది జగమెరిగిన సత్యం.

నేడు పిల్లలు, యువతపై సోషల్‌ ‌మీడియా చూపుతున్న ప్రభావాన్ని విస్మరించలేం. ప్రతి విషయానికీ తక్షణమే స్పందించాలి, నచ్చనిదాన్ని సహించకూడదు, ఎదుటివారిని ఓడించాలి, ‘నేనే గొప్ప’ అనే భావనను పెంచే వాతావరణం పిల్లలపై విశేషంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. హింసను, అసభ్యతను వినోదంగా చూపించే కొన్ని వీడియోలు, కంటెంట్‌కు వారు బానిస అవుతున్నారు. అయితే సోషల్‌ ‌మీడియానే అన్ని నేరాలకు కారణమని చెప్పడం సరికాదు. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏది అనుసరించాలి, ఏది తిరస్కరించాలి అనే విచక్షణను కుటుంబం, విద్యాసంస్థలు నేర్పాలి.

మరోవైపు నైతిక విలువలు క్రమంగా బలహీనపడుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. ఓటమిని అంగీకరించడం, విమర్శను సహించడం, కోపాన్ని నియంత్రించుకోవడం, తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం వంటి సాధారణ జీవిత మర్యాదలు, విలువలు కూడా కొందరికి భారంగా మారుతున్నాయి. చిన్న వివాదాలు పెద్ద ఘర్షణలకు, మాటల తగాదాలు హింసకు దారితీస్తున్నాయి.

పెరుగుతున్న నేరాల సంఖ్య కూడా ఇదే ఆందోళనను తీవ్రం చేస్తోంది. అయితే ప్రతి నేరానికి ఒకే కారణం ఉండదు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత మానసిక స్థితి, మత్తు పదార్థాలు, సామాజిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, చెడు స్నేహాలు, డిజిటల్‌ ‌ప్రభావం వంటి అనేక అంశాలు కలిసి నేర ప్రవృత్తికి దారి తీయవచ్చు. అందుకే పరిష్కారం కూడా బహుముఖంగా ఉండాలి.

పాఠశాలలు కేవలం మార్కులు, ర్యాంకులు ఇచ్చే వ్యవస్థలుగా కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా మారాలి. విద్యార్థుల్లో కోప నియంఠ్రతణ, భావోద్వేగ సమతుల్యత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, గురువుల పట్ల గౌరవం, చట్టం పట్ల అవగాహన వంటి అంశాలపై నిరంతర మార్గదర్శకత్వం అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం మాట్లాడాలి. వారు ఎవరెవరితో తిరుగుతున్నారో, వారి ఆలోచనలేమిటో తెలుసుకోవాలి.

గురువును హతమార్చే స్థాయికి ఒక విద్యార్థి చేరడం అన్నది ఒక్కరోజులో జరిగే పరిణామం కాదు. అది వ్యక్తి జీవితంలో, కుటుంబంలో, విద్యా వ్యవస్థలో, సమాజంలో ఎక్కడో ఏర్పడిన పగుళ్లకు ప్రతిబింబం.

పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడం అంటే మంచి ఉద్యోగం ఇవ్వడం కాదు; మంచి మనసు, మంచి విలువలు, తప్పు-ఒప్పులను గుర్తించే విచక్షణ ఇవ్వడం. గద్ద ఆకాశంలో ఎంతో ఎగరగలిగినా తిరిగి భూమిపై తన గూటికి చేరితేనే దానికి మనుగడ సాధ్యం. అదే విధంగా మనిషి కూడా సాంకేతికత ఆధారంగా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు, కాని తన మానవత్వాన్ని ఆధారం చేసుకుంటేనే మనుగడ సాధ్యం కాదు. విద్య ఎంత పెరిగినా సంస్కారం తగ్గకూడదు. స్వేచ్ఛ ఎంత పెరిగినా బాధ్యత మరవకూడదు.

ఇదే నేటి సమాజం ముందున్న అసలైన సవాలు.

‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది అందరూ గుర్తించి, పాటించాల్సిన అద్భుత మంత్రం. పెద్దలు పిల్లల పెంపకం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్వులు ఏనాడో చెప్పారు. ‘రాజవత్‌ ‌పంచవర్షాణి’ అంటూ ఆరంభమయ్యే ఆ బోధనా శ్లోకం- పిల్లల్ని అయిదేళ్లవరకు రాజమర్యాదలతో, పదేళ్లు వచ్చేవరకు దాసులుగా, పదహారేళ్ల నుంచి మిత్రులుగా చూడాల్సి ఉంటుందని చెబుతుంది.

తమ పిల్లలకు సుఖంగా జీవించేందుకు సరిపడా ఆస్తులు ఇస్తే చాలని అనేకమంది అనుకుంటారే తప్ప, సంస్కారమే గొప్ప ఆస్తి అనే సత్యాన్ని గ్రహించరు. బాల్యంలో మనసులో పడిన బీజాలు పెరిగి పెద్దవై జీవితకాలం ఉండిపోతాయి. అందువల్ల విషబీజాలు పడకుండా పెద్దలు జాగ్రత్త చూపాలి. ఆత్మశక్తి గలవారు, ఇతరుల ప్రభావాలకు లోనుకారు. ఇలాంటివారే సమాజ క్షేమంకోసం పాటుపడతారు.