News

‘హనుమాన్ అంశ్‌’కు క్రేజ్‌.. పంచెకట్టులో థియేటర్‌కు విద్యార్థులు

25views

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్‌ అంశ్‌’ ఒకటిగా నిలిచింది. భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో రోజురోజుకూ వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్‌ భక్తుడు నీమ్‌ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు విశాల్‌ చతుర్వేది తెరకెక్కించారు. ఆధ్యాత్మికత, భక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

పంచెకట్టులో థియేటర్‌కు విద్యార్థులు
‘హనుమాన్‌ అంశ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటానికి తాజాగా వైరల్‌ అవుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలిచింది. ఢిల్లీలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ సినిమాను చూసేందుకు పీవీఆర్‌ థియేటర్‌కు సంప్రదాయ వస్త్రధారణలో వెళ్లారు. పంచెకట్టులో థియేటర్‌కు వచ్చిన విద్యార్థులను చూసిన పలువురు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హనుమాన్‌ భక్తుడైన నీమ్‌ కరోలి బాబా జీవితాన్ని తెరపై చూసేందుకు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో రావడం పలువురిని ఆకట్టుకుంటోంది.

విడుదల సమయంలో ఎదురైన ఇబ్బందులు
సినిమా విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దర్శకుడు విశాల్‌ చతుర్వేది ఇటీవల చిత్ర నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. సినిమా విడుదల సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని తెలిపారు. ఆ సమయంలో బాలీవుడ్‌ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని పేర్కొన్నారు.

అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్‌ పబ్లిసిటీతో సినిమాకు ఆదరణ పెరిగిందని, క్రమంగా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారని చిత్ర బృందం పేర్కొంది.