
రిషికేశ్: భారతీయ ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు భారత్‌లోని జపాన్ రాయబారి ఓనో కేయిచి. రిషికేశ్ పర్యటనలో పవిత్ర గంగానదిలో మూడుసార్లు స్నానం ఆచరించిన ఆయన.. ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జన్మాష్టమి వారాంతంలో జరిగిన ఈ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణమని పేర్కొన్నారు.
గంగానది ఒడ్డున భద్రత కోసం ఏర్పాటు చేసిన గొలుసును పట్టుకుని ఓనో కేయిచి మూడుసార్లు పవిత్ర జలాల్లో మునిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. గంగాస్నానం తనలో గొప్ప భక్తి, కృతజ్ఞతా భావాన్ని కలిగించిందని తెలిపారు.
శతాబ్దాల విశ్వాసాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం
రిషికేశ్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య ఉండటం తనకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఓనో కేయిచి పేర్కొన్నారు.
“చివరకు రిషికేశ్‌లో గంగానదిలో పూర్తిగా మూడుసార్లు మునిగాను. జన్మాష్టమి వారాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కలిగింది. ఇది నిజంగా మరచిపోలేని క్షణం” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.
గంగా హారతిలోనూ పాల్గొన్న రాయబారి
రిషికేశ్‌లో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలోనూ ఓనో కేయిచి పాల్గొన్నారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా గంగానది తీరంలో మట్టి దీపాన్ని వెలిగించారు. గంగాస్నానం, గంగా హారతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
భారతీయ సంస్కృతిపై ప్రత్యేక అభిమానం
భారతీయ సంస్కృతి, ఆహార సంప్రదాయాలపై ఓనో కేయిచి ఆసక్తి చూపడం ఇదే తొలిసారి కాదు. 2024 నవంబర్‌లో భారత్‌లో జపాన్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి భారతీయ జీవన విధానం, ఆహార సంస్కృతిపై తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.
గతంలో ఢిల్లీలో చేతితో బిర్యానీ తింటూ.. సుషీ మాదిరిగానే బిర్యానీని కూడా చేతితో తింటేనే అసలైన రుచి తెలుస్తుందని పేర్కొన్నారు. అలాగే బిహార్ పర్యటనలో ‘లిట్టి చోఖా’ను రుచి చూసి భోజ్‌పురిలో “గజబ్ స్వాద్ బా” అంటూ దాని రుచిని ప్రశంసించారు.
భారతీయ ఆధ్యాత్మికత, సంప్రదాయాల పట్ల జపాన్ రాయబారి చూపుతున్న ఆసక్తి, గంగానదిపై ఆయన వ్యక్తం చేసిన భక్తి సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు అందుకుంటోంది.





