ArticlesNews

జ్ఞాన భాండాగారం సంస్కృతం

3views

ఒక 16 ఏళ్ల కుర్రవాణ్ణి నీవేం చేస్తున్నావంటే ఇంటర్మీడియట్‌, ఎం.‌పి.సీ లేదా బై.పీ.సీ. అన్న సమాధానం తరచుగా వింటుంటాం. కానీ, ఇంజనీర్లు, డాక్టర్లుగా మారే క్రమంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి నేడు చర్చనీయాంశమైంది. మరోవైపు, నైతికపు విలువలు మరచి మాదకద్రవ్యాలకు, లైంగిక ఆకర్షణలకు మధ్య కొట్టుమిట్టాడుతున్న యువత సంఖ్యా బాగానే కనబడుతోంది. ఎన్నో కొత్త కొత్త ‘షిప్పు’లను సృష్టించుకొని జీవిస్తున్న యువతి యువకులు మరెందరో!

మరి ఇన్నాళ్లుగా చదువుకున్న చదువు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతోందా? సంస్కారాన్నీ, సంస్కృతినీ బోధించే చదువు అవసరమని విద్యవేత్తల అభిప్రాయం. అయితే, ఈ రకమైన విద్యను ఇవ్వగలిగేది సంస్కృతభాష ఒక్కటే అనేది సత్యం. ‘సంస్కృతం’ అంటేనే చక్కగా, సరిగ్గా చేసినది అని అర్థం. వేదాలు, శాస్త్రాలు మాత్రమే సంస్కృతంలో ఉన్నాయి, వాటివల్ల నేటి సమాజానికి ఏం ఉపయోగం అనడం కేవలం అజ్ఞానం మాత్రమే. సామాజికం, రాజకీయం, విజ్ఞానం, చారిత్రకం, ఆర్థిక వ్యవహారాలు, నైతికవ•ల్యాలు – ఇలా ఎన్నెన్నో విషయాలు ఎన్నో వేల ఏళ్ల క్రితమే సంస్కృత భాషలో తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమనాడు సంస్కృత భాషాదినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

‘జనని సంస్కృతంబు సకలభాషలకును – దేశభాషలందు తెలుగు లెస్స’, అని అన్నారు పెద్దలు. తెలుగు మన అమ్మభాష అయితే, సంస్కృతం అమ్మమ్మ భాష. అమ్మను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, అమ్మమ్మను విస్మరించకూడదు కదా! అందుకని, రాబోయే యువతరమైనా సరైన దారిలో నడవాలంటే సంస్కృత భాషలోని విషయాలను నేర్పడం ఎంత అవసరమో ఈ క్రింది విధంగా చూడవచ్చు

నైతిక విలువల నిర్మాణం
బాల్యంలో రామాయణం, యౌవనంలో భారతం చదవాలని, వృద్ధాప్యంలో భాగవతం చదవాలని అనాదిగా వస్తున్న సూచన. చిన్నతనంలోనే రామాయణంలోని శ్లోకాలను, ఘట్టాలను పిల్లలకు తెలియచేయడం ద్వారా రాముడు మొదలైన ఆదర్శపాత్రల సద్గుణాలు, ఆచార వ్యవహారాలు పెంపొందుతాయి. ఇక, మహాభారతం ‘ఎలా ఉండ కూడదో’ తెలియజేస్తుంది. యౌవనంలో మహా భారతాన్ని అధ్యయనం చేయడం ద్వారా జీవితంలో దంపతులకు, వైయక్తికంగా వచ్చే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, తద్ద్వారా కుటుంబంలో శాంతి సౌకర్యాలను ఎలా నెలకొల్పుకోవచ్చో తెలుస్తుంది.

శ్రీరాముడు మితభాషి, స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి, మృదుభాషిగా రామాయణంలో వర్ణిస్తూ, యువత పెద్దవారితో, తోటివారితో ఏ విధంగా సంభాషించాలో నేర్పుతోంది సంస్కృతం. సీతాదేవిని అన్వేషించడంలో సహాయ పడితే, జటాయువును శ్రీరాముడు ఎంతగా గౌరవించాడో, వానరరాజు సుగ్రీవుడిని ఎంతగా ఆదరించాడో గమనించి నట్లయితే తోటివారిని ఏ విధంగా గౌరవించాలో యువత తప్పక నేర్చుకుంటారు.

సమాజంలో మనఃస్పర్ధలు, విడాకులు అధికమై, దంపతులు సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ అధ్యయనం ఎంతో ఉపకరిస్తుంది. అదేవిధంగా, భాగవతంలో, కేవలం ఐదేళ్ల వయస్సుగల ప్రహ్లాదుడు తనకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెడు ఆలోచనలు కలిగించినా వాటికి లోను కాకుండా, ఎలా లక్ష్యాన్ని సాధించగలిగాడు అనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటే వారి విద్యాభ్యాసంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించి ముందుకు వెళ్లే శక్తిని పుంజుకుంటారు. అలాగే, భగవద్గీతలోని శ్లోకాలు, నీతి సందేశాన్ని ఇచ్చే సుభాషితాలు చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించడం ద్వారా వారికి ఉచ్చారణ, భాషణ నైపుణ్యం అలవడి, ఎటువంటి సభలలోనైనా ప్రసంగించి, రాణించగలిగే శక్తి ఏర్పడుతుంది. భావవ్యక్తీకరణలో ఇబ్బంది పడేటటువంటి నేటి యువతకు ఇదొక గొప్ప ఉపాయం.

‘‘మాతృవత్‌ ‌పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్‌, ఆత్మవత్‌ ‌సర్వభూతేషు యః పశ్యతి స పండితః’’ – సాటి స్త్రీలను తల్లిగాను, ఎదుటివారి సొమ్మును మట్టిగాను, అన్ని ప్రాణులను తానుగా ఎవరైతే భావిస్తారో వారే నిజమైన జ్ఞానులని, విదేశాలకి వెళ్లి పెద్ద చదువులు చదువుకున్నంత మాత్రాన జ్ఞానులనిపించుకోలేరన్న సత్యాన్ని చెప్పిన ఈ సంస్కృత శ్లోకాన్ని యువత తెలుసుకుంటే దురాచారాల నుండి బయటపడతారు. విశేషించి, శ్లోకం ద్వారా ఒక సందేశాన్ని తెలపడం సంస్కృతంలోని ప్రత్యేకత. విద్యార్థి శ్లోకాన్ని కానీ పద్యాన్ని గాని ఒకసారి ఇష్టపడి నేర్చుకుంటే, దాన్ని జీవితాంతం మరచిపోలేడు. అందుకే వారికి ఎప్పుడు తప్పు చేయాలని అనిపించినా, ఈ శ్లోకమే గుర్తుకు వస్తుంది. ఇలాంటి నీతిశ్లోకాలు సంస్కృతంలో కోకొల్లలు. ఇవన్నీ నేటి యువతలో నైతికపు విలువ లను పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

విజ్ఞాన భాండాగారం
సంస్కృతం ఎన్నోరకాల విజ్ఞాన శాస్త్రాలకు ఆటపట్టు. జ్యోతిషశాస్త్రం అంటే కేవలం జాతకాలు, హస్తసాముద్రికలు బూటకాలు అనుకుంటే పొరపాటే. ఖగోళశాస్త్రంలోని అనేక అంశాలు, గ్రహాల స్థితి గతులు, నక్షత్రాలు కదలికలు వీటన్నింటి గురించి విశదీకరించి రుషులు ‘బృహత్సంహిత’ మొదలైన అనేక గ్రంథాలలో తెలియజేశారు. భరద్వాజ మహర్షి విమానశాస్త్రంలో విమానాన్ని ఎలా తయారు చేయాలో, విమానం నడిపే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు వివరంగా ఉంది. పరాశరమహర్షి వ్యవసాయశాస్త్రం ఎటువంటి పంటలు ఏ కాలంలో పండించాలో తెలియజేస్తుంది. సుశ్రుత, చరక మహర్షుల ఆయుర్వేద సంహితలు – మొదలైన అనేక సంస్కృత గ్రంథాలలో మానవుడు ప్రస్తుతం విస్మరించే, విస్తుపోయే ఆరోగ్యసూత్రాలు ఉన్నాయి. అదేవిధంగా, సంగీతం సాహిత్యం లాంటి కళల విజ్ఞానాన్ని తీసుకుంటే, భరతమహర్షి నాట్యశాస్త్రంలో మానవుడి భావోద్వేగాలను గురించి, మనోభావనల గురించి మనోవిజ్ఞాన శాస్త్రపరమైన చర్చ చేశారు. సంగీత రత్నాకరం, సంగీత దర్పణం మొదలైన గ్రంథాలలో ప్రకృతిలో ఏ జంతువులు ఏ యే శబ్దాలను చేస్తాయో వివరిస్తూ, మనిషి శరీరంలో, కంఠంలో ఉండే అనేక అవయవాల గురించి, వాటి పనితీరు గురించి చెప్పారు. ఏ దేశ చరిత్రను, సామాజిక పరిస్థితులను తెలుసుకోవాలంటే, ఆ దేశానికి సంబంధిం చిన సాహిత్యాన్ని వారి భాషలోనే అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం.

ప్రాచీనకాలంలో సంస్కృతమే వ్యావహారిక భాషగా, అగ్రగామిగా, దేశానికీ దేశానికి మధ్య అనుసంధానభాషగా ఉన్నందున అనేక చారిత్రక అంశాలు సంస్కృతంలోనే రచించారు. వాటిని అధ్యయనం చేయాలంటే సంస్కృతభాషా జ్ఞానం తప్పనిసరి. ఈనాటికి ఇంకా కనుక్కోలేని వైజ్ఞానిక అంశాలు సంస్కృత వాఙ్మయంలో అంతర్నిగూఢంగా ఉన్నాయి. వాటిని పరిశోధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కుటుంబ బాంధవ్యాలు, సంస్కృతి పరిరక్షణ
‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా’ అంటే, భారతదేశానికి రెండు కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయి – ఒకటి సంస్కృతం, రెండు సంస్కృతి. ఎందుకని? మొదట సంస్కృతిని చెప్పి రెండవదిగా కూడా సంస్కృతాన్ని చెప్పి ఉండవచ్చు కదా! అనే సంశయం కలగవచ్చు. మన సంస్కృతి అంతా కూడా సంస్కృతం ద్వారానే వ్యక్తమవుతుందని, అందుకు మొదట సుకృత భాష తెలిస్తేనే సంస్కృతి తెలుస్తుందనే భావనతోనే పెద్దలు ఈ విధంగా చెప్పారు. సంస్కృతమే కాదు ఏ భాష అయినా ఎందుకు అధ్యయనం చేయాలి? ప్రధానంగా సంస్కృతిని తెలుసుకోవడం భాష ద్వారానే సాధ్యం కనుక. తెలుగు భాష తెలుసుకుంటే తెలుగు వారి సంస్కృతి తెలుస్తుంది. కానీ సంస్కృత భాష తెలుసుకుంటే మొత్తం భారతదేశ సంస్కృతి తెలుస్తుంది. ‘ఆ నోభద్రాః క్రతవో యంతు విశ్వతః’ – మనకు అన్ని వైపులనుండి శ్రేష్ఠమైన భావనలు వచ్చుగాక అనే ఉదాత్తమైన సందేశాన్ని ఇస్తూ, అందరికీ మేలు చేయాలనే సంస్కృతిని నేటి యువతకు బోధిస్తోంది సంస్కృతభాష. ‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అని అన్ని లోకాలు అన్ని మతాలవారు సుఖంగా ఉండాలని కోరుకున్నది ఒక్క సంస్కృత వాఙ్మయమే తప్ప, ఇక ఏ వాఙ్మయంలోనూ ఇటువంటి ఉదార భావన కానరాదు.

ఒక పావురం కోసం శిబిచక్రవర్తి తన తొడ మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఒక గోవును కాపాడడం కోసం దిలీప మహారాజు తనను తాను సింహానికి అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు – ఈ సందేశాత్మకమైన చారిత్రక విషయాలన్నీ కాళిదాసు సంస్కృతంలో రచించిన రఘువంశం మొదలైన కావ్యాలలో ఉన్నవే. ఎంతటి ఆపద వచ్చినా, ఎదుట ఉన్నది ఒక పశువే అయినా సరే, కాపాడడానికి ముందుండాలని నేటి యువతను పరోపకారం వైపు, లోక సంక్షేమం వైపు నడిపిస్తోంది సంస్కృతం. ‘‘షోడశే వయసి ప్రాప్తే పుత్రం మిత్రవదాచారేత్‌’’ – 16 ఏళ్లు వచ్చాక తన కొడుకును మిత్రుడిలాగా తండ్రి భావించి, మెలగాలి అని కుటుంబంలో పరస్పరం సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలని మనో వైజ్ఞానికశాస్త్ర దృష్ట్యా వివరించిన సంస్కృత వాఙ్మయం, నేడు ఛిన్నాభిన్నమై పోతున్న కుటుం బాలను కలపడానికి, భారతీయ కుటుంబ వ్యవస్థను చక్కదిద్దడానికి ఒక గొప్ప సాధనం. ‘‘ఏక స్తపః ద్విర ధ్యాయే’’- అంటే తపస్సును ఒంటరిగా చెయ్యి, విద్యా భ్యాసాన్ని నలుగురితోనూ కలిసి చేయి అని. విద్యాభ్యాసంలో విద్యార్థులు ఒకరికొకరు తోడుగా ఉంటూ అధ్యయనం చేసి, పరిశ్రమను మాత్రం ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకుంటూ ఉన్నతిని సాధించాలని దిశానిర్దేశం చేస్తోంది సంస్కృతం. ‘‘నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం’’ – మంచి వారితోనే సాంగత్యం చేయాలి, దీనజనులకు దానధర్మాలను కచ్చితంగా చేయాలి అని ఆదిశంకరాచార్యులు చేసిన ఉపదేశం-నేటి యువత చేస్తున్న చెడు సాంగత్యాలను నిరసిస్తుంది. ఈ రకంగా లోకానికే సంస్కృతిని, సంప్రదాయాన్ని నేర్పిన భాష మన సంస్కృత భాష.

ఒత్తిడిని అధిగమించే ఉపాయం
నేటి యువత, ఉద్యోగస్థులు ‘ఒత్తిడి’వల్ల సతమత మవుతున్నారు. సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతంలోని పద్యాలను వినడం, పాడడం మొదలైన క్రియాకలాపాల ద్వారా మనసుకు రసాను భూతి, ఆనందానుభూతి కలుగుతుంది. తద్వారా పనిలోని ఒత్తిడిని దూరంచేసుకుని ప్రశాంతమైన మనస్థితిని పొందడం సాధ్య మవుతుంది. సంస్కృత భాషలో ఉన్న శ్లోకాలు, మంత్రాలను వినడం వల్ల, వాటిలో ఉండే అక్షర రమ్యత, శ్రావ్యత, వీనులవిందుగా ఉండే గుణం మనస్సుకు మెదడుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రశాంతతను కలిగించి, మానసిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదే విధంగా, సంస్కృత పద్యాలను అల్పప్రాణ, మహాప్రాణ అక్షరాలను సరైన రీతిలో బిగ్గరగా ఉచ్చరించడం ద్వారా మనిషికి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా ఆరోగ్యం ఆయుష్షు రెండూ వర్ధిల్లుతాయి.

ఎన్నో భాషలకు తల్లి
భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక భాషలకు వ•లం సంస్కృత భాష అని విద్యావేత్తలు, భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆవును ఆంగ్లంలో ‘కౌ’అంటారు. అదే సంస్కృతంలో ‘గౌ’ అంటారు. ఆంగ్లంలో ‘దే’ – సంస్కృతంలో ‘తే’, ఆంగ్లంలో ‘ఐయామ్‌’, ‌సంస్కృతంలో ‘అహం’. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. మన ప్రజల పేర్లలో దాదాపుగా అన్నీ సంస్కృతం పేర్లే. ఈ విధంగా, మనం మాట్లాడే భాషలో దాదాపు సగం పైన పాత్రను పోషించే సంస్కృతాన్ని మనం విస్మరించడం అంటే తల్లిని అగౌరవపరచడమే అవుతుంది.

నేడు కేవలం మార్కులను సాధించడమే లక్ష్యంగా సంస్కృతాన్ని బోధిస్తే, పిల్లలకు సంస్కృతం ద్వారా ఏ లాభము చేకూరదు అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సంస్కృతాన్ని పాఠశాలలో నుండే కాక, ఇంటిలో తల్లిదండ్రుల నుండే పిల్లలు నేర్చుకోవడం మొదలు పెట్టినట్లయితే, వారి బుద్ధి కుశలత, ఆలోచన విధానం, సమాజం పట్ల వారికి ఉండే బాధ్యత, భావవ్యక్తీకరణ నైపుణ్యం అలవడి తాము ఎంచుకున్న రంగంలో, ఎంచుకున్న చదువులో కూడా ఉత్తమంగా రాణించే అవకాశం కలుగుతుంది. సంస్కృతాన్ని సంస్కృతంలోనే నేర్చుకొన్నప్పుడే ఈ భాష ఎంత సరళంగా ఉంటుందో తెలుస్తుంది. సంస్కృతభారతి అనే స్వచ్ఛందభాషా ప్రచారసంస్థ సంస్కృతం అందరికీ అనే లక్ష్యంతో దానిని సరళంగా మాట్లాడే విధానాన్ని తెలుగు రాష్ట్రాలలో అలాగే, భారతదేశవ్యాప్తంగా గడిచిన 45 సంవత్సరాలుగా విశేషమైన ప్రచారం చేస్తూ, విద్యార్థులకు ఎన్నో రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అదేవిధంగా, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తదితర• సంస్థలు కూడా సంస్కృతాన్ని విశేషంగా వ్యాప్తిచేస్తున్నాయి. కానీ వాటిలో తమ పిల్లలను చేర్పించడానికి ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారనేది ఆలోచించవలసిన విషయం. సంస్కృత భాషలో ఉన్నంత సాహిత్యం, వ్యాకరణ నిర్మాణం, భాషాసౌందర్యం మరి ఏ భాషలోనూ పరిపూర్ణత్వాన్ని సంతరించు కోలేదు. అట్టి మన చరిత్రకు అద్దం పట్టే సంస్కృత భాషను నేర్చుకోవడానికి, నేర్పించడానికి, ముందుకు తీసుకువెళ్లడానికి, విద్యార్థులు ఆచార వ్యవహారాలను, ఒత్తిడిని అధిగమించి, తమ రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధించి భారతదేశాన్ని విశ్వగురువుగా ‘వికసిత భారతం’గా నిలపడానికి నేటి యువతరం అంతా కదలి రావాలి!

వదతు సంస్కృతం జయతు భారతమ్‌

– శతావధాని ఉప్పలధడియం భరత్‌ ‌శర్మ