
నందిగామ: రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి, మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు ఆలయ ఈవో సురేష్ తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు స్థలం ఆలయానికి చెందినదేనని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.15 కోట్లకుపైగా విలువైన భూమి
నందిగామ పట్టణంలోని చందర్లపాడు రోడ్డులో సర్వే నంబర్ 822-2లోని 79 సెంట్ల ఆలయ భూమి ఆక్రమణకు గురైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.15 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆలయ సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై తొలుత న్యాయస్థానం స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో తెలిపారు. అయితే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆలయ అధికారులు, వంశపారంపర్య ధర్మకర్త మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
మూడు వారాల్లో కూల్చివేతకు ఆదేశాలు
ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. సర్వే నంబర్ 822-2లోని సదరు భూమి పూర్తిగా రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందినదేనని నిర్ధారించినట్లు ఈవో సురేష్ తెలిపారు. భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మూడు వారాల్లోపు తొలగించి, తీసుకున్న చర్యలపై నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.





