కాకినాడ జిల్లా : తుని మండలం కుమ్మరిలోవలోని తాండవ కాశీ క్షేత్రం తపోవనం ఆశ్రమానికి ఉత్తర పీఠాధిపతిగా శృంగేరి పీఠానికి చెందిన గురువులను నియమించాలని అధిక శాతం మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఆశ్రమ నిర్వహణ, వైదిక కార్యక్రమాలపై భక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం సీఈవో మురళి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తపోవనం ఆశ్రమాన్ని సందర్శించింది. ఆశ్రమ ప్రస్తుత నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజల నుంచి బృందం అభిప్రాయాలను సేకరించింది.
ఆశ్రమ ఇన్‌ఛార్జి రమణమూర్తి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు సంప్రదాయానుసారంగా కొనసాగుతున్నాయని కొందరు భక్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నప్పటికీ నిర్వహణలో మరింత పారదర్శకత అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి స్వామివార్ల అనుగ్రహంతో శృంగేరి పీఠానికి చెందిన గురువులను తపోవనం ఆశ్రమ పీఠాధిపతిగా నియమించాలని అధిక శాతం మంది భక్తులు తమ అభిప్రాయాలను బృందానికి తెలియజేశారు.
ఆశ్రమ వైదిక సంపద సురక్షితం
తపోవనం ఆశ్రమానికి సంబంధించిన వైదిక సంపద మాయమైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉపాధ్యాయులు వి.శ్రీరామమూర్తి ఖండించారు. శృంగేరి పీఠం ప్రతినిధుల సమక్షంలో ఆశ్రమంలోని సంపదను పంచనామా చేసినట్లు తెలిపారు.
ఆశ్రమానికి సంబంధించిన సంపద మొత్తాన్ని లాకర్‌లో భద్రపరిచామని, దీనికి సంబంధించిన నివేదికను శృంగేరి పీఠానికి అందజేసినట్లు శ్రీరామమూర్తి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులతో పాటు ఆశ్రమ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





