News

గిరిజన యువతకు ఏఐ శిక్షణ.. చింతపల్లిలో ఆరోహణ ఫెలోషిప్ ప్రారంభం

61views

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ‘ఆరోహణ AI ఫెలోషిప్’కు శ్రీకారం చుట్టారు. చింతపల్లి యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (YTC)లో రెసిడెన్షియల్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఆదిత్య వర్మ ప్రారంభించారు.

తొలి బ్యాచ్‌లో భాగంగా 50 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ఉచిత బోర్డింగ్‌, లాడ్జింగ్‌ సదుపాయాలతో రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ అందించనున్నారు.

ఏఐ నుంచి డేటా అనలిటిక్స్‌ వరకు..
శిక్షణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), డిజిటల్‌ స్కిల్స్‌, డేటా అనలిటిక్స్‌, సమస్య పరిష్కార నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌ అవగాహన కల్పించనున్నారు.

ప్రాజెక్ట్‌ ఆధారిత అభ్యాసం, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రాక్టికల్‌ సెషన్లు, కెరీర్‌ గైడెన్స్‌ ద్వారా విద్యార్థులను సాంకేతిక రంగానికి సిద్ధం చేయనున్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం
గిరిజన ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం ద్వారా భవిష్యత్‌ ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు నూతన ఆవిష్కరణలకు వారిని సంసిద్ధులను చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో Fynity Innovations LLP అమలు భాగస్వామిగా నిర్వహిస్తోంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి హేమలత, Fynity Innovations LLP సహ వ్యవస్థాపకులు రోషన్‌, ఐటీడీఏ అధికారులు, శిక్షణ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.