
తిరుమల బ్రహ్మోత్సవాలంటే.. తొమ్మిది రోజులపాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ వరకు, నేడు కనిపిస్తున్న వైభవం ఒకరోజులో రూపుదిద్దుకుంది కాదు. శతాబ్దాలుగా రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా పరిణామాలు, ఆగమ సంప్రదాయాలు, కాలానుగుణంగా ఏర్పడిన ఉత్సవాలు ఇవన్నీ కలిసి నేటి శ్రీవారి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీర్చిదిద్దాయి. ఈ చరిత్రకు పురాణాలు మాత్రమే ఆధారం కాదు. తిరుమల శ్రీవారి ఆలయ గోడలపై చెక్కిన శాసనాలే ఈ ఉత్సవ పరిణామానికి అత్యంత విలువైన చారిత్రక ఆధారాలు. తితిదే ప్రచురించిన శాసన సంపుటాలు, చారిత్రక గ్రంథాలు ఈ వైభవం వెనుకున్న ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆవిర్భావానికి పురాణ పరంపరలో ప్రత్యేకమైన కథనం ఉంది. శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించిన సందర్భంగా బ్రహ్మదేవుడు తొలిసారిగా ఉత్సవాలను నిర్వహించాడని అందుకే ఈ ఉత్సవానికి ‘బ్రహ్మోత్సవం’ అనే పేరు వచ్చిందని పురాణ ప్రాశస్త్యం.
పదో శతాబ్దం నుంచే..
పల్లవ రాజవంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీవేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించారు. ఆమె అనేక ఆభరణాలతోపాటు ఉత్సవాల నిర్వహణకు భూములనూ దానం చేశారు. ఆమె దానశాసనం తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై ఉంది. ఈ శాసనం ఆధారంగా 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో..
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1513 ఫిబ్రవరి 10న తొలిసారి తిరుమలను దర్శించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 1513లో తన జన్మమాసమైన తైమాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఆయన ఏర్పాటు చేశారు. నీ అనంతరం అచ్యుతరాయులు 1533లో కార్తీ బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన కనిపిస్తుంది. 1534లో ఈ ఉత్సవానికి విరాళం అందించినట్లు ఓ శాసనం చెబుతోంది. 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడడంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య మరోసారి పెరిగింది. 1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామిని ఉత్సవమూర్తిగా ఉపయోగించినట్లు శాసనాల్లో తెలుస్తోంది.
వైభవానికి స్వర్ణయుగం
సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశీయుల కాలంలో ఆలయంలో ఉత్సవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంగమ వంశం కాలంలో కొత్త బ్రహ్మోత్సవాలు చేరగా, తర్వాత తుళువల కాలంలో మరిన్ని ఉత్సవాలు ఏర్పడ్డాయి. 15వ శతాబ్దం నాటికి తిరుమలలో సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఈ సంప్రదాయం చేరింది. విజయనగర కాలం చివరి దశకు వచ్చేసరికి శాసనాల్లో సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నమోదయ్యాయి. 1539 నుంచి 1616 మధ్య పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు శాసనాల్లో కనిపిస్తాయి.
రెండు ఉత్సవాల నుంచి..
చోళులకాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్యపెరిగింది. పెరటాసి, మార్గళి తర్వాత పాంగుని బ్రహ్మోత్సవాన్ని యాదవరాయ సామంతుడు వీరనరసింహ యాదవరాయ కాలానికి ఆపాదించారు. 1254లో చోళరాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300-1330 మధ్య యాదవరాయ సామంతుడి ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం ఏర్పడింది. విజయనగర సామ్రాజం ఏర్పడే నాటికి సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు జరిగాయి. వాటిలో మూడు చోళుల కాలంలో, రెండు యాదవరాయుల కాలంలో ఏర్పడ్డాయి.




