News

అమెరికాలో భారత సంతతిపై పెరుగుతున్న జాతి వివక్ష, ద్వేషం

25views

-నరేష్ కౌశిక్ ( బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్‌లో మాజీ సంపాదకుడు. ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. ఎన్‌డిటివి పోర్టల్ నుండి )

అమెరికా సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ భారతీయ వారసత్వం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఆమె భర్త, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, మిచిగాన్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెనేట్‌ అభ్యర్థి అబ్దుల్‌ ఎల్‌-సయీద్‌ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. ఉషాను ఉద్దేశించి ఎల్‌-సయీద్‌ చేసిన సోషల్‌ మీడియా వ్యాఖ్యలపై భారతీయ అమెరికన్‌ సమాజానికి చెందిన పలువురు నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, ఎల్‌-సయీద్‌పై విమర్శలు చేస్తున్న రాజకీయ వర్గాల్లోని కొందరు వ్యక్తుల నుంచే గతంలో ఉషా వాన్స్‌ కూడా జాత్యహంకార దాడులను ఎదుర్కొన్నారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా శ్వేతజాతి ఆధిపత్యవాది నిక్‌ ఫ్యూంటెస్‌ ఆమె భారతీయ, హిందూ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఉషాను వివాహం చేసుకున్నందుకు జేడీ వాన్స్‌ను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు.

భారతీయ సంతతికి చెందిన ఇతర ప్రముఖులు కూడా ఇటువంటి దాడులను ఎదుర్కొంటున్నారు. మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్‌ రామస్వామి, న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీ, పౌర హక్కుల న్యాయవాది హర్మీత్‌ ధిల్లాన్‌ తదితరులు జాతి, మతపరమైన వ్యాఖ్యలకు గురైన వారిలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్న రామస్వామిపైనా సామాజిక మాధ్యమాల్లో తరచూ జాత్యహంకార వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) తాజాగా విడుదల చేసిన ద్వేషపూరిత నేరాల గణాంకాల ప్రకారం 2025లో ఆసియన్లపై నమోదైన ఇటువంటి కేసులు తగ్గినప్పటికీ, సిక్కులు, హిందువులపై నమోదైన కేసుల్లో పెరుగుదల కనిపించింది. సిక్కులపై ద్వేషపూరిత నేరాలు 24.6 శాతం, హిందువులపై 12 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో ముస్లింలపై నమోదైన ద్వేషపూరిత నేరాలు తగ్గాయి.

అయితే, అధికారిక గణాంకాలు సమస్య తీవ్రతను పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చని పౌర హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాలో జాత్యహంకార వ్యాఖ్యలు లేదా ద్వేషపూరిత ప్రసంగం అన్నీ నేరాలుగా పరిగణించరు. అవి నేరపూరిత చర్యలకు దారితీసినప్పుడు లేదా చట్టపరమైన ప్రమాణాలను అందుకున్నప్పుడు మాత్రమే అనేక సందర్భాల్లో కేసులు నమోదవుతాయి. దీంతో ఆన్‌లైన్‌ వేధింపులు, దూషణలు, బెదిరింపులకు సంబంధించిన అనేక ఘటనలు అధికారిక గణాంకాల్లో కనిపించకపోవచ్చు.

‘స్టాప్‌ ఏఏపీఐ హేట్‌’ సంస్థ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, గత రెండేళ్లలో అమెరికాలో దక్షిణాసియా ప్రజలపై జాత్యహంకార ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2023 జనవరి నుంచి 2025 డిసెంబరు మధ్య దక్షిణాసియా వ్యతిరేక దూషణల వినియోగం 109 శాతం పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. 2025లో సర్వేలో పాల్గొన్న దక్షిణాసియా వయోజనుల్లో 48 శాతం మంది తమ జాతి, జాతీయత లేదా తెగ కారణంగా ద్వేషపూరిత చర్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వారిలో కొందరు జాతిపరమైన వేధింపులు, మరికొందరు శారీరక దాడులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ వేదికలపైనా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ హేట్‌’ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2025లో ‘ఎక్స్‌’లో భారత వ్యతిరేక జాత్యహంకార పోస్టులు పెద్ద సంఖ్యలో ప్రచారం పొందాయి. భారతీయ అమెరికన్‌ రాజకీయ నాయకులు, ప్రజా ప్రముఖులు ఆన్‌లైన్‌లో దీపావళి వంటి పండుగల సందర్భంగా చేసిన పోస్టులకూ జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైన సందర్భాలను సంస్థ నమోదు చేసింది.

అమెరికాలో భారతీయులపై ఉపయోగించే జాత్యహంకార పదజాలంలో సిక్కులు, హిందువులను లక్ష్యంగా చేసుకునే అవమానకరమైన పదాలు కూడా ఉన్నాయి. రామస్వామి, ఉషా వాన్స్‌ వంటి ప్రముఖులపై ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించిన సందర్భాలు నమోదయ్యాయి. మమ్దానీ రాజకీయ ప్రస్థానం సమయంలోనూ ముస్లిం, దక్షిణాసియా వ్యతిరేక వ్యాఖ్యలు పెరిగినట్లు పరిశోధనా సంస్థలు పేర్కొన్నాయి.

భారతీయులపై ఈ తరహా వ్యతిరేకత పెరగడానికి వలస విధానాలు, హెచ్‌-1బీ వీసాలు, ఉద్యోగాలపై పోటీ, ఆర్థిక అసంతృప్తి వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోని భారతీయ సమాజం విద్య, సాంకేతిక, వైద్య, వ్యాపార రంగాల్లో సాధించిన విజయాలపై కొందరిలో ఉన్న అసంతృప్తి కూడా జాత్యహంకారానికి దారితీస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ పోటీ చేయడం, జేడీ వాన్స్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావడం వంటి పరిణామాలతో భారతీయ అమెరికన్ల రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. అనంతరం వలస విధానాలు, హెచ్‌-1బీ వీసాలపై జరిగిన రాజకీయ చర్చల నేపథ్యంలో భారతీయులపై ఆన్‌లైన్‌ ద్వేషపూరిత వ్యాఖ్యలు మరింత పెరిగాయని పలు సంస్థలు పేర్కొంటున్నాయి.

ఇదే సమయంలో భారతీయులపై ద్వేషపూరిత ప్రచారానికి అతివాద రాజకీయ ఉద్యమాలు కూడా వేదికలుగా మారుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిక్‌ ఫ్యూంటెస్‌ నేతృత్వంలోని ‘గ్రోయ్పర్‌’ ఉద్యమం శ్వేతజాతి ఆధిపత్య భావజాలంతో పాటు వలసదారులు, మైనారిటీ సమూహాలపై తీవ్ర వ్యాఖ్యలకు పేరొందింది. ఫ్యూంటెస్‌ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినప్పటికీ, అమెరికా రాజకీయాల్లోని కొన్ని వర్గాలు ఆయనపై కఠినంగా స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి.

ట్రంప్‌ రాజకీయ వర్గాలకు సన్నిహితంగా ఉన్న భారతీయ అమెరికన్లు కూడా జాత్యహంకారానికి అతీతులు కాలేకపోవడం ఈ పరిణామాల్లో మరో ముఖ్యమైన అంశం. ఉషా వాన్స్‌, వివేక్‌ రామస్వామి, కాష్‌ పటేల్‌ వంటి వ్యక్తులు రిపబ్లికన్‌ రాజకీయ వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ, వారి భారతీయ లేదా మతపరమైన నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో దూషణలు నమోదయ్యాయి.

అమెరికాలో భారతీయ సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఈ తరహా జాత్యహంకార ధోరణులు పెరగడం ఆందోళన కలిగించే పరిణామమే. రాజకీయ భేదాలు, వలస విధానాలపై చర్చలు సహజమే అయినప్పటికీ, ఒక వ్యక్తి జాతి, మతం, వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకునే ద్వేషపూరిత ప్రచారం మాత్రం విస్తృత సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది.

భారతీయ అమెరికన్లపై జరుగుతున్న ఆన్‌లైన్‌ వేధింపులు, జాత్యహంకార వ్యాఖ్యలు, ద్వేషపూరిత నేరాలపై మరింత సమగ్రంగా డేటాను సేకరించడం, బాధితులకు చట్టపరమైన సహాయం అందించడం, రాజకీయ నాయకులు ఇటువంటి ద్వేషాన్ని స్పష్టంగా ఖండించడం అవసరమని పౌర హక్కుల సంస్థలు సూచిస్తున్నాయి.