News

పారిస్ లో స్వామి నారాయణ్ ఆలయం ప్రారంభం

24views

భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక అనుబంధం.. బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. పారిస్‌లో నిర్మించిన స్వామినారాయణ్‌ ఆలయ ప్రారంభ వేడుకను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య స్నేహం, సహకారం, అవకాశాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న శతాబ్దాలపాటు ఇరు దేశాల మధ్య అనుబంధానికి ఆధ్యాత్మిక వారధిగా ఈ ఆలయం నిలవాలని ఆకాంక్షించారు.

“నా మిత్రుడు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి భారత్‌-ఫ్రాన్స్‌ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు వంటి కీలక రంగాల్లో నవ్యోత్సాహంతో ముందుకు సాగుతున్నాం” అని మోదీ తెలిపారు.

2026ను నవకల్పనల ఏడాదిగా..
2026 సంవత్సరాన్ని భారత్‌, ఫ్రాన్స్‌ కలిసి నవకల్పనల ఏడాదిగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సహకారం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని అన్నారు.

ఫ్రాన్స్‌ గడ్డపై భారత సైనికులు చేసిన త్యాగాలను చరిత్ర ఎన్నటికీ మరచిపోదని మోదీ పేర్కొన్నారు. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు రాజకీయ, వ్యూహాత్మక అంశాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.