News

రేపటి నుంచి మళ్ళీ టీవీ రామాయణం

790views

తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై రాముడంటే నందమూరి తారక రామారావు, బుల్లితెరపై రాముడంటే అరుణ్‌ గోవిల్‌ (‘రామాయణ్‌’ సీరియల్‌) అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రజాభిమానం చూరగొన్న నాటి టీవీ సీరియల్‌ ‘రామాయణ్‌’. 33 సంవత్సరాల క్రితం రామానంద్‌ సాగర్‌ దర్శకత్వ వహించిన రామాయణ్‌ను చూడటం చాలా మందికి ఒక అపురూప జ్ఞాపకం. ఈ పౌరాణిక సీరియల్‌, జనవరి 25, 1987 నుంచి జులై 31, 1988 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10-10.35 ల మధ్య మొత్తం 85 వారాల పాటు ప్రసారమయ్యింది.

అపురూపమైన ఈ సీరియల్‌ను మళ్లీ చూడాలనేది చాలా మంది ప్రేక్షకుల మనసులోని మాట. ఇక 21 రోజుల ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌’ సందర్భంగా.. నాటి రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ను పునఃప్రసారం చేయాలంటూ నెటిజన్ల విజ్ఞప్తులతో ట్విటర్‌ హోరెత్తిపోయింది. కాగా, ప్రజల కోరిక మేరకు రామాయణ్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు సమాచార ప్రసార శాఖామంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. మార్చి 28 (శనివారం) నుంచి డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌)లో రోజూ రెండు రామాయణ్‌ ఎపిసోడ్‌లు..ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 9-10 గంటలకు ప్రసారం కానున్నాయి.

‘రామాయణ్‌’ సీరియల్‌లో అరుణ్‌ గోవిల్‌, దీపిక్‌ చికిలియా, సునీల్‌ లాహ్రిలు రాముడు, సీత, లక్ష్మణులుగా నటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి జావడేకర్‌ ప్రకటనతో నెటిజన్లే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.