ArticlesNews

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, సామాజిక సమరసతను బోధించిన దార్శనికుడు

4views

(శ్రావణ బహుళ అష్టమి – సంత్ జ్ఞానేశ్వర్ జయంతి)

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ 13వ శతాబ్దంలో మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించిన చెందిన గొప్ప సాధువు, కవి. ఆయన భాగవతుల సంప్రదాయాన్ని ప్రారంభించిన యోగి, తాత్వికుడు. జ్ఞానేశ్వర్ ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించే ఎన్నో రచనలు చేసారు. సంస్కృతంలోనే కాదు, మరాఠీ వంటి ప్రాంతీయ భాషలో కూడా ఆధ్యాత్మిక, తాత్విక భావాలను ప్రకటించడం సాధ్యమే అని ఆయన తన రచనలతో నిరూపించారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం ద్వారా స్ఫూర్తిగా నిలిచారు.

జ్ఞానేశ్వర్ మహారాజ్ విక్రమ శకం 1332లో, అంటే సామాన్య శకం 1275లో భాద్రపద కృష్ణ అష్టమి నాడు పుణే చేరువలోని అలందీ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి విఠల్ పంత్, తల్లి రుక్మిణి. వారి కుటుంబం సన్మార్గులు, పవిత్రులు అని పేరుపొందిన కుటుంబం.

విఠలపంత్ తన భార్య రుక్మిణి అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కాశీ వెళ్ళారు. కానీ ఆయన గురువు ఆదేశం మేరకు వెనక్కు వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించారు. ఆయనకు నలుగురు సంతానం జన్మించారు. వారే నివృతి, జ్ఞానేశ్వర్‌, సోపన్, ముక్తాబాయి. నివృతి నాథ సంప్రదాయాన్ని స్వీకరించి నివృతినాథ్ అయ్యారు. ఆయనే తన తమ్ములకు గురువయ్యారు కూడా. జ్ఞానేశ్వర్, ఆయన ముగ్గురు సోదరులూ కీర్తనలు, భజనల ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని సాధన చేసారు. జ్ఞానమనే సంప్రదాయమే నిజమైన వారసత్వమని, అదే మానవాళికి మూలమనీ జ్ఞానేశ్వర్ బోధించేవారు. పదిహేనేళ్ళ వయసులోనే, అంటే సామాన్యశకం 1290 నాటికి జ్ఞానేశ్వర్ భగవద్గీతకు వ్యాఖ్యానం రచించారు. అది జ్ఞానేశ్వరి పేరుతో ప్రఖ్యాతమైంది. మరాఠీ సాహిత్యంలో జ్ఞానేశ్వరికి ప్రత్యేకమైన స్థానముంది. సంత్ జ్ఞానేశ్వర్ మతానికి బాధ్యత అనే అర్థాన్నిచ్చారు. మతంలోనుంచి అనవసరమైన విషయాలను తొలగించారు.

సంత్ జ్ఞానదేవ్ చంద్రభాగా నదీతీరాన ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య పద్ధతిని పెంచిపోషించారు. భాగవతులు లేదా వార్కరీలు అనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. నామదేవుడు, గోరా కుంభార్, సవతా మాలి, నరహరి సోనార్, చోఖామేలా వంటి సంతులకు ఆయన మార్గదర్శకుడు. ఆధ్యాత్మిక మార్గంలో అందరికీ సమానత్వం కోసం ఆయన కృషి చేసారు. 21ఏళ్ళ చిన్నవయసులో, అంటే సామాన్యశకం 1296లో అలందీలోని ఇంద్రాయణీ నదీ తీరాన సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ సమాధిస్థితికి చేరుకున్నారు.

సంత్ జ్ఞానేశ్వర్ తాను రాసిన అభంగాల్లో సమరసతను చాటారు. అనుభవం నుంచి పొందే ఆనందాన్ని ఆయన సమరసత అన్నారు. సామరస్యానికి మూలం సంస్కారమే. మానవుడిలో దైవత్వాన్ని జాగృతం చేసేది సంస్కారమే. దానివల్లనే ప్రతీ ఒక్కరూ తమ తోటి మానవులలోని దైవాన్ని కనుగొనగలరు. మానవుడిలోని దైవత్వాన్ని జాగృతం చేయడమే సాధువుల కర్తవ్యం. సామరస్యానికి మార్గం ఆధ్యాత్మికతే. అందుకే సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్యాత్మిక జాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేన్నయినా వ్యతిరేకించడం కంటె సమన్వయం చేయడంపైనే ఆయన విశ్వాసం ఉంచారు. అటువంటి జ్ఞానేశ్వర్ మహరాజ్ ప్రవచించిన ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మార్గం మనందరికీ ఆదర్శప్రాయం.