
(భాద్రపద బహుళ అష్టమి – (కృష్ణాష్టమి) కృష్ణుడి పుట్టిన రోజు)
శ్రీకృష్ణ జన్మాష్టమి యావత్ భారతదేశానికీ పండుగే. విష్ణుమూర్తి దశావతారాల్లో ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు పుట్టిన రోజును జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు. భారతీయ కాలగణన పద్ధతి అయిన చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి నాడు కృష్ణుడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు, జాగారం చేస్తారు, భాగవత పురాణంలో వివరించిన శ్రీకృష్ణ లీలలను భజనలుగా కీర్తనలుగా ఆలపిస్తారు.
విష్ణుమూర్తి దశావతారాల్లో పూర్ణావతారాలు రెండు. రామావతారం, కృష్ణావతారం. త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల నడిచేది. అప్పటి ప్రజలకు ధర్మస్వరూపానికి ఉదాహరణను చూపిస్తే వారు ఆయనను అనుసరించేవారు. అందుకే, బంధుత్వాలను సైతం పక్కన పెట్టి ధర్మమార్గంలో చరించే మర్యాదా పురుషోత్తముడైన రాముడు ఆనాటి దేవుడు అయ్యాడు. ద్వాపరయుగంలో ధర్మానికి ఉదాహరణ చూపిస్తే చాలదు, అప్పటి ప్రజలను అవసరమైతే శిక్షించి అయినా సరే, వారికి ధర్మాన్ని నేర్పించాలి. అందుకే కృష్ణుడు ధర్మం వైపు నిలబడి, కురుక్షేత్రంలో పాండవులు విజయం సాధించడంలో తోడ్పడ్డాడు.
కృష్ణుడు కేవలం పురాణ పురుషుడు కాదు, ఆయనొక చారిత్రక పురుషుడు. ఆయన జీవితం మనకు ప్రేరణ దాయకం. ఎన్నో విషయాలను తన ఆచరణ ద్వారా నేర్పించిన మహత్తరమైన గురువు శ్రీకృష్ణపరమాత్మ.
ఒక వ్యక్తి ప్రేమస్వరూపుడై ఆ ప్రేమను అందరికీ పంచితే, అది తిరిగి అతనికే చేరుతుంది. దానికి నిదర్శనం కృష్ణుడి జీవితం. అసలు కృష్ణుడి పేరులోనే ఆ గుణం ఉంది. కృష్ణుడు అంటే అందరినీ ఆకర్షించేవాడు అని అర్థం. చిన్నారి పొన్నారి కన్నయ్యగా ఉన్న దశ నుంచి, గీతాబోధ చేసి విశ్వరూపం చూపిన దశ వరకూ కృష్ణుడి జీవితంలోని ప్రతీ అడుగూ మనకొక పాఠమే.
గోవర్ధన గిరినెత్తి ప్రజలను రక్షించడం ద్వారా ప్రజల కోసం నాయకుడు స్వయంగా నిలబడాలని కళ్ళకు కట్టాడు. ప్రకృతిని గౌరవించాలి, రక్షించుకోవాలి అని కాళీయ మర్దన ఘట్టం ద్వారా నేర్పించాడు. భారతంలో పాండవుల పక్షాన నిలబడి, ధర్మం బలహీనంగా ఉన్నా దానికే అండగా నిలవాలని తెలియజేసాడు. కుబ్జ, రుక్మిణి, ద్రౌపది వంటి మహిళలను ఉద్ధరించడం ద్వారా నారీమణుల రక్షణ నరుడి కర్తవ్యమని చాటిచెప్పాడు. నిరుపేద మిత్రుడు సుదాముణ్ణి గౌరవించడం ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనూ స్నేహితులను మరచిపోకూడదని పాఠం చెప్పాడు. శమంతకమణిని దొంగిలించాడన్న నీలాపనిందలను భరించి ఊరుకోలేదు. అసలు జరిగిందేంటో తెలుసుకుని మణిని తిరిగి తెచ్చి తన నిజాయితీని కాపాడుకున్నాడు, ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడి నిలవాలని నిరూపించాడు.
అలా, జీవితంలో అడుగడుగునా ధర్మాన్ని ఆచరించడం ముఖ్యమని మనకు నేర్పించినందువల్లనే శ్రీకృష్ణుడు మనకు దైవం అయ్యాడు. ఎప్పుడూ ధర్మం వైపే ఉండాలి, శరణాగతి అర్థించిన వారికి అండగా నిలవాలి అని తన జీవితం ద్వారా మనకు సందేశం ఇచ్చిన మహనీయుడు శ్రీకృష్ణుడు.
చిన్నారి చిలిపి కృష్ణుడు… వెన్నదొంగగా ఆవుల కాపరిగా ఆటలాడించిన కృష్ణుడు… ధర్మానికి కాపు కాసిన కృష్ణుడు…. గీతామార్గం బోధించిన కృష్ణుడు… స్థితప్రజ్ఞత నేర్పిన కృష్ణుడు… అందరికీ వందనీయుడు. కృష్ణం వందే జగద్గురుం.





