News

మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’

2views

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రసిద్ధ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పాల్గొని ముఖ్య ప్రసంగం చేయనున్నారు. ఈ వేడుకను “వసుధైవ కుటుంబకం” అనగా ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే దివ్యభావన, ఆలోచన ఆధారంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న 200 కంటే ఎక్కువ హిందూ-అమెరికన్ సంస్థలు ఈ విలక్షణ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. ఈ సదస్సుకు వేలాది మంది ప్రజలు విచ్చేస్తున్నారని, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని తెలిపారు.

ఈ వేడుకలకు ముందు న్యూయార్క్ ఈస్ట్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయాన్ని మోహన్ భాగవత్ సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొత్తం సృష్టి శ్రీకృష్ణుని స్వరూపమేనని అభివర్ణించారు. భగవద్గీతలోని విషయాలను ప్రస్తావిస్తూ ప్రపంచంలో రకరకాల వైవిధ్యాలు, అభిప్రాయ భేదాలు, ఘర్షణలు, భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, వాటన్నింటి వెనుక అంతర్లీనంగా ఉన్నది శ్రీకృష్ణ తత్వమేనని వివరించారు. మానవుడు తన జీవితంలో ఎప్పుడూ బాధ్యతల నుంచి పారిపోకూడదని, తన కర్తవ్యాన్ని నిష్టతో నెరవేరుస్తూ ప్రతి వ్యవస్థలోనూ, వస్తువులోనూ దైవత్వాన్ని దర్శించాలని సూచించారు.

ఒక కార్పొరేట్ కంపెనీ పనితీరును ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ ఉన్నతాధికారులు, సీఈఓలు ప్రణాళికలు రూపొందిస్తే ఉద్యోగులందరూ ఐక్యంగా ఆ లక్ష్య సాధన కోసం కష్టపడతారని గుర్తుచేశారు. అదే విధంగా మానవాళి అంతా ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం శ్రమిస్తున్నామని గ్రహించినప్పుడు ప్రగతి వేగవంతమవుతుందని డాక్టర్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.