News

ఐఎస్‌ఐ కోసం భారత సిమ్‌కార్డులు పాకిస్థాన్‌కు తరలించిన ముస్లిం దంపతుల అరెస్ట్‌

0views

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన యువ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సరాయ్‌ కాలే ఖాన్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సాహిల్‌, అతని భార్య సమీరాను ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ అదుపులోకి తీసుకుంది.

పోలీసుల ప్రకారం.. ఈ దంపతులు 2024 నుంచి సోషల్‌ మీడియా వేదికగా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారు. భారత సిమ్‌కార్డులను సేకరించి, దుబాయ్‌ మీదుగా పాకిస్థాన్‌కు చేరవేసే లాజిస్టికల్‌ సహకారం అందించినట్లు దర్యాప్తులో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

2024–25 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్‌కార్డులను పాకిస్థాన్‌కు పంపినందుకు సుమారు రూ.30 వేల నగదు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిమ్‌కార్డులను పాక్‌ ఏజెంట్లు భారత్‌లోని వాట్సాప్‌ గ్రూపుల్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించుకున్నారని, తద్వారా రక్షణ రంగానికి సంబంధించిన కీలక, సున్నితమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు.

సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం అతని మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపగా పాకిస్థాన్‌ ఏజెంట్లతో జరిగిన సంభాషణలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. 2024లో సమీరా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పాక్‌ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం మరికొందరు ఏజెంట్లతో సంబంధాలు ఏర్పడ్డాయని విచారణలో సాహిల్‌ వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనాల ఎర చూపి తమ నెట్‌వర్క్‌లోకి ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించే వ్యక్తులను గుర్తించడం, సైనిక న్యాయస్థానాల్లో కోర్ట్‌ మార్షల్‌ విచారణలు ఎదుర్కొంటున్న ఆర్మీ సిబ్బందికి సంబంధించిన వివరాలను సేకరించడం వంటి పనులను సాహిల్‌కు అప్పగించినట్లు పోలీసులు ఆరోపించారు.

అనంతరం సమీరాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దంపతుల వద్ద నుంచి ఈ కార్యకలాపాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసుతో భారత్‌లో పనిచేస్తున్న స్థానిక ఏజెంట్లు, ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లు, స్లీపర్‌ సెల్స్‌తో ఈ నెట్‌వర్క్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్‌ మీడియా పరిచయాలు, ఆర్థిక ప్రలోభాల ద్వారా భారతీయులను పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌లోకి ఆకర్షించే ప్రయత్నాలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.