News

భారతీయ సంస్కృతికి కళలే మూలం.. ప్రాచీన సంపదను పరిరక్షించాలి: ఒడిశా గవర్నర్‌ హరిబాబు

2views

విశాఖపట్నం: భారతీయ కళలు దేశ ప్రాచీన సంపదకు ప్రతీకలని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. నాట్యం, సంగీతం భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని, తరతరాలుగా వస్తున్న ఈ అపురూప కళా సంపదను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన విశాఖ మ్యూజిక్‌, డ్యాన్స్‌ అకాడమీ (వీఎండీఏ) 40వ వార్షికోత్సవంలో హరిబాబు పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం, కళారంగాల్లో విశాఖ నగరం ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాలుగా సంగీతం, నాట్య రంగాల అభివృద్ధికి వీఎండీఏ చేస్తున్న కృషిని అభినందించారు.

భారతీయ కళలు కేవలం వినోదానికి సంబంధించినవి కాదని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను తరతరాలకు చేరవేసే శక్తివంతమైన మాధ్యమాలని హరిబాబు అన్నారు. ఆధునిక కాలంలోనూ భారతీయ శాస్త్రీయ కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుండటం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

భారతీయ నాట్యకళను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో పద్మవిభూషణ్‌ డాక్టర్‌ పద్మ సుబ్రహ్మణ్యం చేసిన కృషిని హరిబాబు ప్రత్యేకంగా కొనియాడారు. భారతీయ నృత్య సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటిచెప్పిన ఆమె సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఈ సందర్భంగా 180కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్న పద్మవిభూషణ్‌ డాక్టర్‌ పద్మ సుబ్రహ్మణ్యంకు వీఎండీఏ తరఫున ‘నాట్య విద్యా భారతి’ బిరుదును ప్రదానం చేశారు. మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూయలర్స్‌ తరఫున అందించిన స్వర్ణ కమలాన్ని డాక్టర్‌ హరిబాబు చేతుల మీదుగా పద్మ సుబ్రహ్మణ్యం స్వీకరించారు. వీఎండీఏ తరఫున బిరుదుతో పాటు రూ.లక్ష నగదు పురస్కారాన్ని కూడా అందజేశారు.

సన్మానానికి స్పందించిన డాక్టర్‌ పద్మ సుబ్రహ్మణ్యం.. భారతీయ కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అన్నారు. భారతీయ నాట్య సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయత, తాత్వికత, సాంస్కృతిక లోతు వాటిని విశిష్టంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నారు. నాట్యశాస్త్ర సంప్రదాయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆమె వివరించారు.

భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతం మన దేశపు వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని, ఈ కళలను కాపాడటం అంటే మన మూలాలను కాపాడుకోవడమేనని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కళాభారతి వంటి సంస్థలు యువతలో కళలపై ఆసక్తిని పెంచుతూ, గురు–శిష్య సంప్రదాయాన్ని కొనసాగించడంలో చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

నాలుగు దశాబ్దాలుగా కళల సేవలో కొనసాగుతున్న వీఎండీఏ 40వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సంగీతం, నాట్యం, సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటిచెప్పింది.