News

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ లో విద్యార్థి కృష్ణ ఆత్మహత్య

3views

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థి కృష్ణ (19) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అలీగఢ్‌లో తాను ఉంటున్న పీజీ గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు అతను రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను విఫలమయ్యాననే భావనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణ జమ్మూలోని పీర్ మీఠా ప్రాంతానికి చెందిన విక్రాంత్ శర్మ కుమారుడు. విక్రాంత్ శర్మ బీజేపీ తూర్పు మండలానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కృష్ణ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం ఏఎంయూ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగంలో బీఏ రెండో సంవత్సరం ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుతున్నాడు.

అలీగఢ్‌లోని దోద్‌పూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో పీజీగా ఉంటున్న కృష్ణ.. నాలుగు రోజుల క్రితమే స్వస్థలం జమ్మూ నుంచి అలీగఢ్‌కు తిరిగి వచ్చాడు. ఘటనకు సుమారు మూడు గంటల ముందు తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు తండ్రి తెలిపారు.

కృష్ణ మూడు నెలల క్రితం ఎన్‌డీఏ రాత పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి దశలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. చదువుతో పాటు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న సమయంలో అతని మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కృష్ణ గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో ‘బాబు’ అనే పదం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అతని స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణ ఫోన్‌లో ఎవరితోనో ఎక్కువ సమయం మాట్లాడేవాడని సహచర విద్యార్థులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

మొబైల్ ఫోన్ పరిశీలిస్తున్న పోలీసులు
కృష్ణ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, దాని లాక్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్‌లోని కాల్ డేటా, ఇతర సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

కుమారుడి మరణవార్త తెలియగానే తండ్రి జమ్మూ నుంచి అలీగఢ్‌కు చేరుకున్నారు. కృష్ణ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి, సోదరి కన్నీరుమున్నీరవుతున్నారు.

రక్షాబంధన్‌కు సోదరి వద్దకు వస్తానని చెప్పి..
గత ఆగస్టు 15న జమ్మూ నుంచి అలీగఢ్‌కు వచ్చిన కృష్ణ.. రక్షాబంధన్ పండుగ రోజున వీడియో కాల్ ద్వారా సోదరి చేత రాఖీ కట్టించుకుంటానని మాట ఇచ్చినట్లు తండ్రి తెలిపారు. అయితే పండుగ రాకముందే కుమారుడి మరణవార్త కుటుంబాన్ని విషాదంలో ముంచింది.

కృష్ణ మృతికి దారితీసిన అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. యువకుల మానసిక ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.