News

ప్రకృతి.. ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం ‘అశ్వత్థ నారాయణ వివాహం’

3views

మంగళగిరి: భారతీయ సంస్కృతిలో ప్రకృతిని దైవ స్వరూపంగా భావించే విశిష్ట సంప్రదాయానికి మంగళగిరిలోని అరణ్యారామం వేదికైంది. రావి–వేప మొక్కలను శాస్త్రోక్తంగా పూజించి నాటే ‘అశ్వత్థ నారాయణ వివాహం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు, ఆయన సతీమణి పద్మజ ఈ కార్యక్రమంలో పాల్గొని రావి, వేప మొక్కలను నాటారు.

హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి వంటిదని, మన పుట్టుక నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి అనేక వనరులను భూమాత నుంచే పొందుతున్నామని అన్నారు. తల్లిదండ్రులు మనకు అందించే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదేనని పేర్కొన్నారు.

అలాంటి భూమాతకు మనం తిరిగి ఏమి చేస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అడవులను నరికివేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యానికి గురిచేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదని.. మన కర్తవ్యమని స్పష్టం చేశారు.

ప్రకృతి పరిరక్షణకు అశ్వత్థ నారాయణ వివాహం
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని నాగబాబు తెలిపారు. రావి, వేప చెట్లను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావిస్తారని వివరించారు.

ప్రకృతిని దైవంతో అనుసంధానించిన భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణకు ఎంతటి ప్రాధాన్యం ఉందో ఈ సంప్రదాయం చాటిచెబుతుందని అన్నారు. రావి, వేప చెట్లు కలిసి పెరగడం వల్ల పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ చెట్లు అనేక జీవరాశులకు ఆవాసంగా మారి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.