
ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఆగస్టు 26 సాయంత్రం ముస్కాన్ అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముస్కాన్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ముస్కాన్ విద్యార్థినిగా ఉండటంతో పాటు పార్ట్ టైమ్ మోడల్‌గా పనిచేసేదని సమాచారం. నిందితుడు ఇమ్రాన్ జిమ్ ట్రైనర్‌గా పనిచేసేవాడని ఆమె స్నేహితురాలు తెలిపింది. కొంతకాలంగా ముస్కాన్‌ను వెంబడిస్తూ, తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది. ముస్కాన్ అతడితో మాట్లాడేందుకు నిరాకరించడంతో వేధింపులకు పాల్పడినట్లు కూడా స్నేహితురాలు పేర్కొంది.
ముస్కాన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, హత్య అనంతరం ఏ మార్గంలో అక్కడి నుంచి పారిపోయాడన్న విషయాలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
హత్యకు అసలు కారణం, నిందితుడి ఉద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వివాహానికి నిరాకరించడమే హత్యకు కారణమా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ గుప్తా తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.





