News

గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్ల దాడి.. చేసిన షేర్ ఖాన్ అరెస్ట్

8views

ముంబైలో గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. మజ్‌గావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల దానిష్ షేర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మజ్‌గావ్‌లోని కాంటినెంటల్ హైట్స్ భవనం వద్ద గణేశుడి ఊరేగింపు జరుగుతున్న సమయంలో బాణాసంచా కాల్చడంతో భారీగా పొగ వ్యాపించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దానిష్ ఖాన్‌కు పొగ కారణంగా కళ్లలో మంట, అసౌకర్యం కలిగినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఖాన్.. తన వద్ద ఉన్న కోడిగుడ్లను భవనం పై అంతస్తు నుంచి గణేశుడి ఊరేగింపుపైకి విసిరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఘటన అనంతరం నిందితుడి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దానిష్ ఖాన్‌ను గుర్తించి, ఘటన జరిగిన సుమారు 36 గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ జయంత్ మీనా తెలిపారు.

బైకుల్లా పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 299, 196 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన వెనుక పూర్తి కారణాలు, ఇతర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.