ArticlesNews

ప్రకృతి ప్రసాదం ఈశాన్య భారతం

0views
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ చిరునవ్వుల చిన్నారిని “నువ్వు చైనీస్‌వా?” అని ప్రశ్నించినప్పుడు, ఆ పాప ఎంతో అమాయకంగా, ముద్దుగా “కాదు, నేను ఇండియన్‌ని!” అని ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, కోట్లాది మంది భారతీయుల హృదయాలను తాకింది. అంతే కాదు, తమను చైనీస్ అని పిలవవద్దని, తమను భారతీయులుగా ప్రేమించాలని కోరింది. ఆ చిన్నారి నిస్వార్థమైన కోరిక వెనుక కేవలం అమాయకత్వం మాత్రమే లేదు… శతాబ్దాల మన భారతదేశ సంస్కృతి, చరిత్ర, పురాణాల ఆత్మబంధం దాగి ఉంది.దానిని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిధి
ఈశాన్య భారతం మన దేశానికి కేవలం భౌగోళికంగా ఉన్న ఒక సరిహద్దు ప్రాంతం మాత్రమే కాదు. అది భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక హృదయ స్పందన! భరతమాత మకుటంలో మెరిసే అరుదైన రత్నం. అష్టలక్ష్ముల లాంటి “ఎనిమిది సోదరి రాష్ట్రాలు” (అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం) ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిధి.
ప్రకృతి వింతలు: ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే మేఘాలయలోని చిరపుంజీ, మౌసిన్‌రామ్… కొండల మధ్య మేఘాలు తేలే దృశ్యాలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. మేఘాలయలోని జీవించి ఉన్న వేళ్ల వంతెనలు ప్రకృతి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.
జల, జీవ వైవిధ్యం: లోక్తాక్ సరస్సు (మణిపూర్) ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్క్. అస్సాంలోని కాజీరంగా జాతీయ పార్క్ ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.
 
సూర్యోదయ భూమి: అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘దోంగ్’ గ్రామంలో భారతదేశంలో అందరికంటే ముందుగా భాస్కరుడు తన తొలి కిరణాలను ప్రసరింపజేస్తాడు.
పరిశుభ్రతకు చిహ్నం: సిక్కిం దేశంలోనే తొలి 100% ఆర్గానిక్ (సేంద్రీయ) రాష్ట్రంగా నిలిచి ప్రపంచానికి ఆదర్శంగా మారింది. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన ‘మావ్లిన్నోంగ్’ గ్రామం ఈశాన్యంలోనే ఉంది.
భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు అత్యంత ఆవశ్యకం?
ఈశాన్య భారతం లేని భారతదేశాన్ని ఊహించలేము. దేశ సమగ్రతకు, పురోగతికి ఈ రాష్ట్రాలు ప్రధాన కారణాలు:
భౌగోళిక భద్రత & వ్యూహాత్మక ప్రాముఖ్యత: చైనా, మైన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాల సరిహద్దులను పంచుకునే ఈశాన్య ప్రాంతం మన దేశానికి సైనిక రక్షణ కవచం లాంటిది. ‘సిలిగురి కారిడార్’ (చికెన్స్ నెక్) ద్వారా దేశ మిగతా భాగంతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం మన దేశ భద్రతకు నాడి లాంటిది.
యాక్ట్ ఈస్ట్ పాలసీ : భారతదేశాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానించే ఏకైక ల్యాండ్ బ్రిడ్జ్ (భూమార్గం) ఈశాన్య భారతం. వాణిజ్యం, పర్యాటకం, దౌత్య సంబంధాల విస్తరణకు ఇది కీలక ద్వారం.
ఆర్థిక, సహజ వనరుల నిధి: దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ (దిగ్‌బోయ్, అస్సాం), సహజ వాయువులతో పాటు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీ (అస్సాం టీ) ఉత్పత్తిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా జలవిద్యుత్ ఉత్పత్తికి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అత్యంత కీలకమైనవి.
సాంస్కృతిక సంపద: 200 కంటే ఎక్కువ గిరిజన తెగలు, విభిన్నమైన ఆహారపు అలవాట్లు, జానపద నృత్యాలు (ఉదాహరణకు బిహు, మణిపురి నృత్యం) భారతదేశ “భిన్నత్వంలో ఏకత్వం” అనే సూత్రానికి ప్రపంచ వేదికపై జీవం పోస్తున్నాయి.
మన పురాణాలు, చరిత్ర చాటిన విడదీయరాని బంధం
ఈశాన్య రాష్ట్రాల ప్రజల రూపురేఖలను చూసి, వారిని పరాయివారిగా భావించడం ఎంతటి అజ్ఞానమో మన ప్రాచీన పురాణాలు, చారిత్రక ఆధారాలు చాలా స్పష్టంగా చాటుతున్నాయి:
శ్రీకృష్ణుడు – రుక్మిణి (అరుణాచల్ ప్రదేశ్): మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి అర్ధాంగి అయిన రుక్మిణి దేవి అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘మిష్మి’ తెగకు చెందిన రాజకుమారి. అక్కడి దిబాంగ్ వ్యాలీలోని రోయింగ్ ప్రాంతంలో ఇప్పటికీ ‘రుక్మిణీనగర్’ పురాతన అవశేషాలు మన సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.
అర్జునుడు – ఉలూపి (నాగాలాండ్): మహాభారతంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన తీర్థయాత్రల సమయంలో నాగాలాండ్‌కు చెందిన నాగ రాజకుమారి ఉలూపిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే కురుక్షేత్ర సంగ్రామంలో పరాక్రమాన్ని ప్రదర్శించిన మహావీరుడు ఇరావాన్.
అర్జునుడు – చిత్రాంగద (మణిపూర్): మహాభారత కాలంలో అర్జునుడు మణిపూర్ రాజకుమారి అయిన చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు బభ్రువాహనుడు మణిపూర్ రాజ్యాన్ని పాలించి, మహాభారతంలో విశేష ప్రాధాన్యత పొందాడు.
భీముడు – హిడింబి (నాగాలాండ్ & అస్సాం): భీముని భార్య హిడింబి, వారి కుమారుడు ఘటోత్కచుడు నాగా కొండల ప్రాంతానికి చెందినవారేనని చరిత్రకారులు చెబుతారు. నాగాలాండ్‌లోని దిమాపూర్ ప్రాంతంలో ఇప్పటికీ దీనికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.
కామాఖ్య పీఠం (అస్సాం): అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంతప్రముఖమైన కామాఖ్య దేవి ఆలయం అస్సాంలోని గువాహటి సమీపంలో ఉంది. యుగయుగాలుగా దేశమంతటికీ ఇది పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
అహోం రాజవంశం (అస్సాం): మొఘల్ సామ్రాజ్యం భారతదేశమంతటా విస్తరిస్తున్న సమయంలో, అస్సాంను ఏలిన అహోం వీరుడు లచిత్ బోర్ఫుకన్ సరిహద్దుల్లో మొఘలులను తుత్తునియలు చేసి ఈశాన్య భారతాన్ని సగర్వంగా నిలబెట్టాడు.
వారిది ‘చైనీస్ ఫేస్’ కాదు… అది మన భరతమాత స్వరూపం!
ఇంతటి ఘనమైన పురాణ, సాంస్కృతిక బంధం ఉన్న ఈశాన్య భారత ప్రజలను వారి కళ్ల ఆకారాన్ని బట్టి, ముఖకవళికలను బట్టి “చైనీస్” అని అనడం మన స్వంత సోదరసోదరీమణులను పరాయీకరించడమే కాక, మన దేశ వైవిధ్యాన్ని మనమే అవమానించినట్లవుతుంది. భారతదేశం అంటే కేవలం ఒక నిర్దిష్ట రూపురేఖలు మాత్రమే కాదు… విభిన్న భాషలు, సంస్కృతులు, శారీరక రూపాల సమాహారం! రిహద్దుల్లో మైనస్ డిగ్రీల తీవ్రమైన చలిలో, క్లిష్టమైన కొండ ప్రాంతాల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే మన భారతీయ సైనికుల నుంచి… ఒలింపిక్స్ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన మేరీ కోమ్, మీరాబాయి చాను, బైచుంగ్ భుటియా, లవ్లీనా బోర్గోహైన్ వంటి క్రీడా రత్నాల వరకు చాలామంది మన ఈశాన్య భారతీయులున్నారు.
ఆ అరుణాచల్ చిన్నారి చెప్పిన “నేను ఇండియన్‌ని” అనే అమాయకమైన మాట… మన ఆలోచనా ధోరణి మారాలని, రూపురేఖల సరిహద్దులు దాటి హృదయంతో ఆలోచించాలని మనందరికీ గుర్తుచేస్తున్న ఒక గొప్ప సందేశం. ఈశాన్య భారతం మన దేశపు కిరీటం. మనం మారుదాం…మన ఆలోచనలను మార్చుకుందాం..మనందరం భారతీయులమే అని తెలుసుకుందాం.