
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరమణకు చెందిన పొలంలో ఈ రాళ్లు బయటపడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.
పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల వెంకటరమణ ఎక్స్‌కవేటర్ సాయంతో దాన్ని చదును చేయిస్తున్నారు. ఈ క్రమంలో భూమిలో నుంచి ఒక్కసారిగా 32 నాగపడగ రాళ్లు బయటపడ్డాయి. ఇవి పురాతన కాలం నాటివిగా భావిస్తున్న స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రాళ్లను అక్కడే ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని ఓ పురోహితుడు రైతుకు సూచించినట్లు సమాచారం. అప్పటివరకు రాళ్లు లభించిన ప్రదేశంలో పెద్ద గుంత తీసి, అందులో నీటిని నింపి నాగపడగ రాళ్లను ఉంచాలని సూచించారు.
దీంతో రైతు రాళ్లు బయటపడిన ప్రాంతంలో ఎక్స్‌కవేటర్ సాయంతో గుంత తవ్వించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని నాగపడగ రాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన నాగపడగ రాళ్లు ఒకేసారి 32 బయటపడటంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




