ArticlesNews

జీవితంలోని నాలుగు దశలు.. మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దే సంస్కార మార్గం

27views

స్వర్ణపీఠమైనా సరే నాలుగు కోళ్లు లేనిదే నిలవదు. అలాగే మానవుడు పరమపదాన్ని చేరాలంటే బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే నాలుగు జీవన దశలను దాటక తప్పదు. ప్రతి దశకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో దశలో పొందే అనుభవాలు, సంస్కారాలు, బాధ్యతలే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

బాల్యం గ్రహింపు శక్తి ఎక్కువగా ఉండే దశ. చిన్నారి మనసు స్వచ్ఛమైన తెల్లకాగితం వంటిది. పెద్దలు దానిపై ఏది రాస్తే అదే ముద్రితమవుతుంది. అందుకే పసిహృదయాల్లో సద్గుణాలు, శీలసంపద, ధర్మబద్ధమైన ఆలోచనలను పెంపొందించేందుకు మన పూర్వీకులు నీతి కథలు, పురాణ గాథలను ఆశ్రయించారు. జిజియాబాయి వంటి తల్లులు చిన్ననాటి నుంచే శివాజీకి వీరత్వం, ధర్మం, దేశభక్తి వంటి విలువలను బోధించారు.

తల్లిదండ్రుల సంరక్షణతో పాటు, సరైన గురువు మార్గదర్శకత్వం లభించే కౌమారదశ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. ఈ దశలో క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదల అలవడితే భవిష్యత్తులో అవే విజయానికి మార్గదర్శకాలు అవుతాయి. ద్రోణాచార్యుడు శిష్యులందరికీ విలువిద్యను నేర్పించినప్పటికీ, అర్జునుడు తన ఏకాగ్రత, శ్రద్ధ, సాధనతో ప్రత్యేక ప్రతిభను కనబరిచాడు.

మంచీచెడుల మధ్య తేడా తెలుసుకోవడం, పాపపుణ్యాలపై అవగాహన, సహానుభూతి, ప్రాణికోటిపై దయ వంటి సుగుణాలకు బీజం పడేది కూడా ఈ వయసులోనే. మొక్కకు దడి కట్టి రక్షించినట్లే, కౌమారదశలో పిల్లలకు సరైన దిశానిర్దేశం అందిస్తే వారు సంస్కారవంతమైన పౌరులుగా ఎదుగుతారు. శిల్పి ఉలితో రాయిని అందమైన శిల్పంగా మలిచినట్లుగా గురువులు తమ శిష్యుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి.

యౌవనం మనిషి జీవితంలో అత్యంత శక్తిమంతమైన దశ. కృషి చేసే సామర్థ్యం, పట్టుదల, లక్ష్యసాధన, భవిష్యత్తుపై స్పష్టమైన ఆలోచన ఈ దశలో పుష్కలంగా ఉంటాయి. మేధస్సు, పంచేంద్రియాలు పూర్తి పటుత్వంతో పనిచేసే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వర్తమానాన్ని ఉజ్వలమైన భవిష్యత్తుగా మలచుకోవచ్చు.

రామకృష్ణ పరమహంస ప్రేరణతో నరేంద్రుడు స్వామి వివేకానందగా రూపాంతరం చెందినది కూడా యౌవన దశలోనే. సంసార బాధ్యతలు పూర్తిగా భుజాలపై పడకముందు లభించే ఈ సమయం యువతకు అపురూపమైన అవకాశం. అయితే ఇదే దశలో దుర్వ్యసనాలు, చెడు సాంగత్యం, క్షణికావేశాలు కూడా జీవితాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. అందుకే యువతకు తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, బంధువుల నుంచి సరైన మార్గదర్శకత్వం అవసరం.

యువత తమ శక్తిని, సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజానికీ మేలు చేయగలరు. ఒక తరాన్ని తీర్చిదిద్దడంలో కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వార్ధక్యంలో ఇంద్రియ పటుత్వం క్రమంగా తగ్గినా, అనుభవ సంపద మాత్రం పెరుగుతూనే ఉంటుంది. పెద్దల అనుభవం, జ్ఞానం, నేర్పరితనం, మనోధైర్యం తర్వాత తరాలకు కరదీపికలుగా నిలుస్తాయి. అందుకే మన సంప్రదాయంలో వృద్ధులను గౌరవించడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం ఒక విలువగా ఏర్పడింది.

అంపశయ్యపై ఉన్నప్పటికీ పాండవులకు రాజధర్మాన్ని ఉపదేశించిన భీష్మ పితామహుడి గాథ దీనికి గొప్ప ఉదాహరణ. శరీరం సహకరించకపోయినా జ్ఞానం, అనుభవం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని భీష్ముడి జీవితం చెబుతుంది.

అందుకే మనిషి జీవితంలోని ఏ దశలో ఉన్నా తన జ్ఞానం, శక్తి, అనుభవాలను లోకకల్యాణానికి వినియోగించాలి. ఇతరులకు ఉపయోగపడే జీవితం గడిపినవాడు ప్రత్యేకంగా మోక్షం కోసం తపస్సులు చేయకపోయినా ఉత్తమ గతిని పొందగలడనే భావన భారతీయ ధార్మిక సంప్రదాయంలో కనిపిస్తుంది.

బాల్యంలో సంస్కారం.. కౌమారంలో క్రమశిక్షణ.. యౌవనంలో సాధన.. వార్ధక్యంలో అనుభవాన్ని పంచడం — ఈ నాలుగు మెట్లే సార్థక జీవితానికి బాటలు వేస్తాయి.