
లండన్: బ్రిటన్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, నీటి సరఫరా సంస్థలు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మసీదుల్లో ప్రార్థనలకు ముందు ముస్లింలు నిర్వహించే వుజూ (ఆచార శుద్ధి) సమయంలో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో నదులు, జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతుండటంతో గృహాల్లో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. నీటిని ఆదా చేసే విధానాలను వివిధ సామాజిక వర్గాలకు చేరువ చేసేందుకు స్థానిక సంస్థలు, కమ్యూనిటీ సంస్థల సహకారం తీసుకుంటున్నారు.
ఈ ప్రచారంలో భాగంగా కేంబ్రిడ్జ్ సెంట్రల్ మసీదు సహకారంతో వుజూ సమయంలో నీటిని పొదుపు చేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. వుజూ పూర్తయ్యే వరకు కుళాయిని నిరంతరం తెరిచి ఉంచకుండా.. ఒక లీటర్ పాత్ర లేదా కూజాను ఉపయోగించడం ద్వారా నీటి వృథాను గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
కుళాయిని పూర్తిగా తెరిచి ఉంచితే ఒక్కసారి వుజూ చేసేటప్పుడు సుమారు 6 నుంచి 12 లీటర్ల వరకు నీరు ఖర్చయ్యే అవకాశం ఉందని నీటి పొదుపు ప్రచారంలో పేర్కొంటున్నారు. అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించడం ద్వారా గణనీయమైన పరిమాణంలో నీటిని ఆదా చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అదే విధంగా, వంటలోనూ నీటి వినియోగాన్ని తగ్గించేందుకు పలు సూచనలు చేస్తున్నారు. దక్షిణ భారతీయ కుటుంబాలు బియ్యాన్ని పదేపదే కడగడం బదులుగా పరిమితసార్లు మాత్రమే కడగడం ద్వారా ప్రతి వంట సమయంలో కొన్ని లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని ప్రచారంలో సూచించినట్లు సమాచారం.
నీటి సంక్షోభంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి సుమారు £270,000 ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మతం, ప్రాంతం, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.





