News

విద్యార్థుల్లో నైతికవిలువలు, ఆధ్యాత్మికతనుపెంపొందించడమే “సద్గమయ” లక్ష్యం

4views

విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటు సనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే “సద్గమయ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ తెలిపారు.

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో  “సద్గమయ” కార్యక్రమాన్ని డా. మేడసాని మోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆధ్యాత్మిక చైతన్యం అందించినప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం, బాధ్యతాయుత పౌరసమాజం నిర్మాణమవుతుందని అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీతతో పాటు మహనీయుల జీవితాలు, వారి బోధనల ద్వారా విద్యార్థులకు విలువాధారిత విద్యను అందించనున్నట్లు తెలిపారు.

“సద్గమయ” ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, భక్తి, సత్యనిష్ఠ, సత్ప్రవర్తన, దేశభక్తి, భారతీయ సంస్కృతిపై గౌరవం వంటి సద్గుణాలను విద్యార్థుల్లో పెంపొందిస్తామని చెప్పారు.

నీతి పద్యాలు, సుభాషితాలు, ఎంపిక చేసిన పద్యాలను విద్యార్థులు నేర్చుకుని, వాటి భావాలను అర్థం చేసుకుని జీవితంలో ఆచరించేలా ప్రోత్సహిస్తామన్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వ్యక్తీకరణ సామర్థ్యంతో పాటు నైతిక వ్యక్తిత్వం కూడా వికసిస్తుందని వివరించారు.

ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు వంటి బాల భక్తుల అచంచల భక్తి, ధైర్యం, ఏకాగ్రత, పట్టుదలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భక్తి, జ్ఞానం, సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సాధారణ విద్యతో పాటు విలువాధారిత, ఆధ్యాత్మిక విద్యను అందించి సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే “సద్గమయ” ధ్యేయమని డా. మేడసాని మోహన్ స్పష్టం చేశారు.

 

7 టీటీడీ పాఠశాలల్లో 1,678 మంది విద్యార్థులకు “సద్గమయ”

ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి, తిరుమలలోని 7 టీటీడీ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు “సద్గమయ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 1,678 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

కార్యక్రమంలో వేద ఆశీర్వచనం, క్విజ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డీపీపీ అదనపు కార్యదర్శి శ్రీమతి కల్యాణి, ఏఈవో శ్రీ సత్యనారాయణ, శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.