ArticlesNews

మనుస్మృతి వివాదం: ‘రక్షణ’ను బానిసత్వంగా చిత్రీకరించే రాజకీయ కుట్ర

6views
  ఇటీవల మహారాష్ట్రలోని పుణె వేదికగా జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ “సనాతన సంప్రదాయంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు” అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మూల గ్రంథాలలోని వాక్యాలను అరకొరగా సేకరించి విమర్శించడం సనాతన ధర్మం పట్ల అవగాహనారాహిత్యానికి, రాజకీయ కుట్రలకు అద్దం పడుతోందని ధర్మాభిమానులు భావిస్తున్నారు.
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, స్త్రీని కేవలం ఒక స్త్రీగా మాత్రమే కాక, దైవ సమానమైన ‘శక్తి’ రూపంలో ఆరాధించే ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. సనాతన ధర్మం విజ్ఞానానికి సరస్వతిని, ఐశ్వర్యానికి లక్ష్మిని, ధైర్యానికి దుర్గాదేవిని పూజించే సాంప్రదాయం మనది. వేద కాలంలో గార్గి, మైత్రేయి, అపాల, లోపాముద్ర వంటి మహిళలు గొప్ప గొప్ప వేద పండితులతో శాస్త్రార్థం చేసిన మంత్ర దృష్టలుగా నిలిచారు. వేదాల్లోని అనేక సూక్తాలను మహిళా రుషులే అందించారు. స్త్రీని ‘గృహలక్ష్మి’గా, జగన్మాతగా భావించి పూజించిన చరిత్ర భారతీయ సంస్కృతిది. అయితే, ఆధునిక సామాజిక విమర్శకులు మనువు చెప్పిన ఒక శ్లోకంలోని “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అనే పాదాన్ని వ్యాఖ్యానిస్తూ… స్త్రీకి తనను తాను రక్షించుకునే స్వతంత్రం ఇవ్వలేదని ఆ కాలంలో చెప్పిన అభిప్రాయాన్ని కూడా నేటికీ వ్యక్తం చేస్తుంటారు. అది ఇప్పటి కాలానికి పూర్తి అన్వయం కాదు. అది మినహాయించి, స్త్రీకి అన్ని రకాల స్వాతంత్ర్యాలు నేడున్నాయి.
పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే |
రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి ||
భావం:
బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారులు స్త్రీకి రక్షణగా ఉంటారు. స్త్రీని ఎప్పుడూ రక్షణ లేని అనాథగా, అంటే ఒంటరిగా వదిలేయకూడదు. ఈ శ్లోకంలో ప్రధానమైన అంశం ‘రక్షతి’ (రక్షించడం). ఇది స్త్రీ శారీరక, ఆర్థిక, సామాజిక భద్రతకు పురుషులు సంపూర్ణ బాధ్యత వహించాలని స్పష్టం చేసే రక్షణ సూత్రం. దీనిని బానిసత్వంగా ప్రచారం చేయడం సరికాదు.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః |
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ||
భావం:
ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. స్త్రీలను గౌరవించని చోట చేసే జపాలు, యజ్ఞాలు, పూజలు ఏవీ శుభ ఫలితాలను ఇవ్వవు. ఇల్లు సంతోషంగా ఉండాలన్నా, రాజ్యం వర్ధిల్లాలన్నా స్త్రీని గౌరవించడం అత్యంత ఆవశ్యకం.
కంచి పరమాచార్యులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ ఒక సందర్భంలో మాట్లాడుతూ వివాహం మొదలైన పుణ్య కార్యాల సమయంలో స్త్రీ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు.
ముస్లిం సమాజం – ఇస్లామిక్ చట్టాలు
సనాతన ధర్మాన్ని విమర్శించే లౌకికవాద నాయకులు, ఇతర మతాల గ్రంథాలు, ఆచారాలలో స్త్రీలకు ఉన్న స్థానాన్ని విశ్లేషించడానికి వెనుకాడుతుంటారు. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం పురుషుడు నలుగురిని వివాహం చేసుకునే వెసులుబాటు ఉండటం, ఒక్క మాటతో స్త్రీ జీవితాన్ని రోడ్డున పడేసే ‘ముమ్మారు తలాక్’ పద్ధతి సుదీర్ఘకాలం కొనసాగడం, న్యాయస్థానాల్లో ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడితో సమానమని పరిగణించడం, వారసత్వ ఆస్తిలో సగం వాటా మాత్రమే ఇవ్వడం వంటివి స్త్రీల హక్కులను దెబ్బతీసే అంశాలని విమర్శకులు ఎత్తిచూపుతారు. మసీదులలో ప్రవేశం లేకపోవడం, శతాబ్దాలుగా పర్దా, బుర్ఖా ఆంక్షలకు గురిచేయడం వారి సామాజిక స్వేచ్ఛను పరిమితం చేశాయి.
క్రైస్తవ మత గ్రంథాలు – విమర్శలు
క్రైస్తవ మత గ్రంథాలలోని పాత, కొత్త నిబంధనలను పరిశీలిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:34-35 లో స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలని, వారు లొంగి ఉండాలే తప్ప మాట్లాడటానికి అనుమతి లేదని చెప్పబడింది. తిమోతికి రాసిన పత్రిక 2:11-12 లో కూడా స్త్రీ పూర్ణ విధేయతతో నేర్చుకోవాలని, పురుషునిపై ఆధిపత్యం చేయడానికి అంగీకరించబోనని పేర్కొనబడింది. బైబిల్ కథనాల ప్రకారం మానవాళి చేసిన మొదటి పాపానికి (Original Sin) అవ్వ (Eve) కారణమనే భావన శతాబ్దాలుగా పాశ్చాత్య సమాజాలలో మహిళలను తక్కువ చేసి చూడటానికి పునాదిగా మారింది. పురుషుని పక్కటెముక నుంచి స్త్రీ సృష్టి జరిగిందని కూడా పేర్కొన్నారు.
సనాతన ధర్మంలో స్త్రీకి గల విలువపై ఉపన్యాసాలు దంచే నాస్తికులు, హేతువాదులు వామపక్షవాదులు, అన్యమతస్తులు… ఈ పై విషయాల గురించి నోరెత్తరు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ తదితర దేశాల్లో స్త్రీల పరిస్థితి ఏమిటో వీరికి నిజం తెలిసినా స్పందించరు. అంతెందుకు అరబ్ షేక్‌లతో హైదరాబాద్ పాత బస్తీలో జరిగే బలవంతపు నిఖాల గురించి సైతం నోరెత్తరు.
సనాతన ధర్మంలో స్త్రీని ఎప్పుడూ ఒక భోగ వస్తువుగానో, ద్వితీయ శ్రేణి పౌరురాలిగానో చూడలేదు. మనుస్మృతిలోని ధార్మిక రక్షణ సూత్రాలను స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి మాట్లాడటం భారతీయ సంస్కృతిపై జరుగుతున్న భావజాల దాడే, మనుస్మృతిలోని పవిత్ర శ్లోకాల సంపూర్ణ అర్థాన్ని గ్రహించకుండా “మనువాద ఆలోచన” అని విమర్శించడం రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతోంది. స్త్రీ మూర్తిని ఇంటికి దీపంగా, సమాజానికి మూలస్తంభంగా నిలిపిన సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుకోవడం, రాజకీయ లబ్ధి కోసం జరిగే వక్రీకరణలను తిప్పికొట్టడం ప్రతి ధర్మాభిమాని బాధ్యత.