
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో ధ్వంసమైన ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని తాజాగా పునరుద్ధరించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఇందుకు ఆర్థికంగా సహకరించినట్లు సమాచారం. దీంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ భవనానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనానికి కొత్తగా మార్బుల్స్ వేయడంతో పాటు పెయింటింగ్ పనులు, డోమ్‌ల నిర్మాణం చేపట్టినట్లు చిత్రాలను బట్టి తెలుస్తోంది.
రూ.25 కోట్ల సాయం చేసినట్లు నిఘా వర్గాల సమాచారం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాన కార్యాలయ పునర్నిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం వాయిదాల రూపంలో సుమారు 25 కోట్ల పాక్ రూపాయలను అందించినట్లు తెలుస్తోంది. పునర్నిర్మాణ పనులు పూర్తికావడంతో భవనం మళ్లీ కార్యకలాపాలకు సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో జైషే మహ్మద్ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు సంస్థ సిద్ధాంతాలను బోధిస్తారని సమాచారం. గతంలో భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు సంబంధించిన కుట్రలు, వ్యూహరచనలో ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించినట్లు భారత భద్రతా వర్గాలు ఆరోపించాయి.
‘ఆపరేషన్ సిందూర్’తో భారీ దెబ్బ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. బహవల్పూర్లోని జైషే మహ్మద్ స్థావరం కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా మారింది.
ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు భారత్ వెల్లడించింది. పాక్ భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద మౌలిక వసతులపై ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది.
జైషే మహ్మద్ 2001 భారత పార్లమెంట్‌పై దాడి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు భారత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ధ్వంసమైన స్థావరాన్ని తిరిగి నిర్మించడంపై పాక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




