News

పాక్‌ సైన్యంపై సొంత దేశంలోనే విమర్శలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్‌ రెహమాన్‌

33views

పాకిస్థాన్‌ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్‌ను ఉద్దేశించి అప్పటి పాక్‌ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జమైత్‌ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

పెషావర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఫజ్లుర్‌ రెహమాన్‌.. దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సైన్యం మాత్రం ఆర్భాటపు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. నిరంతర అణచివేత, రక్తపాతం కొనసాగితే అవి సరికొత్త భౌగోళిక సరిహద్దుల మార్పులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

1971 నాటి పరిణామాలను గుర్తుచేసిన ఆయన.. అప్పటి సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘పర్వతాల్లో, ఎడారుల్లో, వీధుల్లో.. ఎక్కడైనా సరే శత్రువులకు వ్యతిరేకంగా పోరాడతాం’’ అంటూ యాహ్యా ఖాన్‌ అప్పట్లో సైనికులను ఉద్దేశించి చెప్పారని అన్నారు. అయితే, ఆ తర్వాత పాక్‌ సైన్యం ఓటమిని చవిచూసి ఆయుధాలు వదిలేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

‘‘ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. దేశ ప్రజలు బాధపడుతుంటే సైన్యం మాత్రం ఆనందంగా ఉండటం సరికాదు’’ అని ఫజ్లుర్‌ రెహమాన్‌ వ్యాఖ్యానించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అయితే గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

1971లో ఏం జరిగింది?

1971లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధం బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారితీసింది. 13 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో పాక్‌ సైన్యం తీవ్రంగా దెబ్బతింది. చివరకు 1971 డిసెంబర్‌ 16న తూర్పు పాకిస్థాన్‌లోని పాక్‌ దళాలు భారత సైన్యం, ముక్తి బాహినికి లొంగిపోయాయి. సుమారు 93 వేల మంది పాక్‌ సైనికులు, సిబ్బంది యుద్ధ ఖైదీలుగా మారారు. ఈ పరిణామంతో బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది.