News

కరడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తం

5views

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్‌ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడు బహిరంగంగా కనిపించడం లేదు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అతడిని అజ్ఞాతంలో ఉంచినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

అజార్‌ బయటకు రాకపోయినా అతడి ప్రసంగాలు, తీవ్రవాద భావజాలాన్ని మాత్రం జైషే మహ్మద్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. యువతను ఆకర్షించేందుకు వాటినే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌తో పోలిస్తే అజార్‌ ప్రసంగాలకు ఎక్కువ ఆదరణ ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అజార్‌ పరిస్థితిపై జైష్‌ కార్యకర్తల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో అతడి పాత ప్రసంగాలు, వీడియోలను కొత్తవిగా ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటిపై అనుమానాలు పెరగడంతో తర్వాత వ్యూహాన్ని మార్చారు. అజార్‌ ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడో కార్యకర్తలకు వివరించడం మొదలుపెట్టారు.

కొత్తగా చేర్చుకునే యువతకు అజార్‌ ప్రసంగాలను పదేపదే వినిపిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అతడి పేరుతో పనిచేయాలని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో అజార్‌ కుటుంబంలో పలువురు చనిపోయిన విషయాన్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాయి.

అజార్‌ కుటుంబ సభ్యుల మరణాలను ‘త్యాగం’గా చూపుతూ యువతలో సానుభూతి పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. జైష్‌ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలంటూ కొత్తవారిని రెచ్చగొడుతున్నట్లు పేర్కొన్నారు.

భారత్‌, పాకిస్థాన్‌లో అజార్‌ ప్రసంగాలు, రచనలు, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన కంటెంట్‌ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. భారత్‌లోని జైష్‌ ప్రభావిత మాడ్యూళ్లకు కూడా ఈ కంటెంట్‌ను చేరవేస్తున్నట్లు తెలిపాయి. పాకిస్థాన్‌తో సంబంధాలు బయటపడకుండా ఆయా మాడ్యూళ్లు నేరుగా జైష్‌ పేరుతో కాకుండా ఆ సంస్థ భావజాలం పేరుతో పనిచేయాలని సూచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.