
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం తమపై కాల్పులు జరిపితే ఇకపై తూటాలతోనే సమాధానం చెబుతామని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమాన్ కాశ్మీరీ హెచ్చరించారు.
పీవోకేలో గత కొంతకాలంగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలను అణచివేసేందుకు భద్రతా బలగాలు కఠిన చర్యలకు పాల్పడుతున్నాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చింది.
పాలంద్రీలో నిర్వహించిన ఓ సమావేశంలో అమాన్ కాశ్మీరీ మాట్లాడుతూ.. ప్రజలు పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించకుండా నిరసనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను బహిష్కరించాలని కోరారు.
“బుల్లెట్లతో నడిచే ప్రభుత్వాన్ని మీరు అంగీకరిస్తారా? మేము బుల్లెట్లతో నడిచే ప్రభుత్వాన్ని అంగీకరించం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుండా బలప్రయోగానికి పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
పీవోకేలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమాన్ కాశ్మీరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.





