News

మతబోధకుడికి నాలుగు మరణశిక్షలు! తమిళనాట పోక్సో కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

5views

చెన్నై : నలుగురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు నాలుగు మరణశిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్ ఇలందైకుళం ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్న అబ్రహం (50) అనే మత బోధకుడు సెలవుల సమయంలో నైతిక విలువలకు సంబంధించిన తరగతుల సాకుతో బాలికలను లైంగికంగా వేధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించడంతో వారు గంగైకొండాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఈ కేసును విచారించిన తిరునల్వేలి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి సురేశ్ కుమార్ అబ్రహంకు నాలుగు మరణశిక్షలు విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. నిందితుడికి రూ.52 వేలు జరిమానా విధించారు. అత్యాచారానికి గురైన బాలికలు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.

కాగా, బాలికలపై అబ్రహం వేధింపులు 2019 కొవిడ్ లాక్డౌన్ సమయంలోనే ప్రారంభమయ్యాయని, 2022లో అతడి నిర్వాకంపై ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేవరకూ కొనసాగాయని జిల్లా ఎస్పీ విశ్వేశ్ బాలసుబ్రమణియన్ శాస్త్రి తెలిపారు. ఈ వేధింపుల గురించి ఎవరికీ చెప్పవద్దని బాధితులను నిందితుడు తీవ్రంగా బెదిరించాడని చెప్పారు. కాగా, 2022లో పోక్సో చట్టం కింద అబ్రహంను పోలీసులు అరెస్టు చేశారు.