News

బహు భార్యత్వం వుంటే జీతంలో 20 శాతం కట్.. అసోం నిర్ణయం

0views

బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి జీతాల్లో కోత విధిస్తామని సీఎం హిమంత బిస్వ శర్మ కీలక ప్రకటన చేశారు.

‘‘ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చట్టబద్ధంగా తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండా ఆమెను వదిలేసి మరో మహిళతో వివాహ బంధం ఏర్పర్చుకుంటే, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. ఆ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంకు ఖాతాలోనే నేరుగా వేసేస్తాం. అయితే.. ఆ భార్య దీని గురించి ప్రభుత్వం దగ్గర దరఖాస్తు మాత్రం చేసుకోవాలి’’ అని సీఎం ప్రకటించారు.

ఇటీవల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు విడాకుల ప్రక్రియ పూర్తికాకముందే మరో మహిళతో కలిసి ఉంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హిమంత తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొదటి భార్యతో విడాకుల అంశం ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ జీతంలో 20 శాతం కోత కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తొలి భార్యకు ఆర్థిక సహాయం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపైనా అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధించనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరో వైపు గత యేడాది అసోం ప్రభుత్వం బహుభార్యత్వాన్ని నిషేధించింది. అసెంబ్లీలో అస్సాం బహు భార్యత్వ నిషేధ బిల్లు 2025″ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో బహుభార్యత్వ వివాహాలను నిషేధించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు అవకాశం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాంతాలకు, షెడ్యూల్‌ గిరిజనులకు ఈ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చారు. అంటే వారి సాంప్రదాయ కస్టమ్స్, ఆచారాలకు భంగం కలగకుండా చూశారు.

ఎవరైనా ఓ వ్యక్తి భార్య లేదా భర్త బతికి ఉండగా, విడాకులు పొందకుండా రెండో వివాహం చేసుకుంటే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ముఖ్యంగా మొదటి వివాహం చెల్లుబాటులో ఉన్నప్పుడు లేదా విడాకుల ద్వారా రద్దు కానప్పుడు మరొకరిని వివాహం చేసుకోవడాన్ని ఈ చట్టం బహుభార్యత్వంగా నిర్వచించింది.

“ప్రతిపాదిత చట్టాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా వివాహాన్ని జరిపించే ఏ వ్యక్తికైనా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు” అని బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. పదేపదే అదే నేరం చేస్తే తదుపరి ప్రతి నేరానికి నిర్దేశించిన శిక్షకు రెట్టింపు శిక్ష విధించాలని కూడా ఇది ప్రతిపాదించింది.